● ఎస్పీ అశోక్‌కుమార్
జగిత్యాలక్రైం: నేర విచారణ, కేసులను సత్వరమే పరిష్కరించేలా పనిచేయాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. తన కార్యాలయంలో నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు. పెండింగ్‌లో కేసుల్లో పురోగతి సాధించాలని, అవసరమైతే పెండింగ్ కేసులపై న్యాయమూర్తులను కలిసి పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. పోక్సో కేసుల్లో విచారణ వేగవంతం చేయాలన్నారు. దొంగతనాల నివారణకు ప్రతి సర్కిల్ పరిధిలో ఒక టీంను నియమించాలని పేర్కొన్నారు. నాన్‌బెయిలబుల్ వారెంట్ల అమలుకు అధికారులందరూ కృషి చేయాలన్నారు. నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా చూడాలన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి ప్రశంస పత్రాలు అందించారు. ఏఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీలు రాములు, పురుషోత్తంరెడ్డి, రవికుమార్, సీఐలు కరుణాకర్, రాంనర్సింహారెడ్డి, సుధాకర్, డీసీఆర్బీ, సీసీఎస్, ఐటీకోర్ అధికారులు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
బాధితుల సమస్యల
పరిష్కారానికి చర్యలు
బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా 14 మంది దరఖాస్తులు సమర్పించారు. వాటిని పరిశీలించిన ఆయన ఫిర్యాదుదారుల సమస్యలపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
మూడ నమ్మకాల
నిర్మూలన చట్టం తేవాలి
పెగడపల్లి: మూఢనమ్మకాల పేరుతో దాడులు, హత్యలు పెరుగుతున్నాయని, వాటి నిర్మూలనకు చట్టం తేవాలని భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి నరేశ్ కోరారు. మండలకేంద్రంలో సోమవారం మాట్లాడారు. కొద్దిరోజులుగా రోజుకో ప్రాంతంలో హత్యలు, దాడులు జరుగుతున్నాయని, రంగారెడ్డి జిల్లాలో నోముల గ్రామంలో మంత్రాల నెపంతో వృద్ధురాలిపై దాడి, మంచిర్యాల జిల్లా నిల్కివెంకటాపూర్‌లో ఒకరి హత్య, భద్రాద్రి జిల్లాలో చేతబడి నెపంతో వృద్ధురాలిని చెట్టుకు కట్టేసి కాళ్లకు మేకులు దించడం, తాజాగా మండలంలోని కసూరిబా పాఠశాలలో ఉపాధ్యాయురాలు ఓ విద్యార్థినిని మైసమ్మవా.. దయ్యానివా అంటూ ప్రశ్నించడం వంటి ఘటనలు దారుణమన్నారు. ప్రభుత్వ పరంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.


