జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని శనివారం విడుదల చేశారు. వానాకాలం పంటలకు నీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని శుక్రవారం కలిసి విన్నవించారు. స్పందించిన ఆయన నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 45.459 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
పది రోజులపాటు విడుదల
ఇబ్రహీంపట్నం: పొట్ట దశలో ఉన్న పంటలను కాపాడేందుకు శ్రీరాంసాగర్ నుంచి నీటిని విడుదల చేశామని, పదిరోజుల పాటు కొనసాగుతుందని ప్రాజెక్టు ఎస్‌ఈ జగదీశ్వర్ తెలిపారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
తన విజ్ఞప్తి మేరకే..
కోరుట్ల: మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి తాను చేసిన విజ్ఞప్తి వేరకే నీటిని విడుదల చేశారని వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన చేశారు. వర్షాభావం నేపథ్యంలో కోరుట్ల నియోజకవర్గంలో నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని, చివరి తడి అందిస్తే పంట చేతికొస్తుందని మంత్రికి వివరించినట్లు పేర్కొన్నారు.
ఎమర్జెన్సీని తలపిస్తున్న మోదీ పాలన
జగిత్యాల: ప్రధాని మోదీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. 1975లో ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్య హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛను హరించారని, నాటి చీకటి రోజులను మోదీ మరోసారి గుర్తుచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, హక్కులపై తరచూ మాట్లాడే మోదీ హక్కులపై ఆంక్షలు పెట్టడమేంటని ప్రశ్నించారు. ఢిల్లీని నిర్బంధించి రైళ్ల రాకపోకలను నిలిపివేయడం నిరంకుశ విధానాలను తలపిస్తున్నాయన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పరిరక్షించేందుకు ప్రజాస్వామ్యవాదులందరూ రాజకీయాలకతీతంగా ముందుకురావాలని కోరారు.
పండుగలకు పకడ్బందీ భద్రత
జగిత్యాలక్రైం: దుర్గా నవరాత్రి ఉత్సవాలు, దసరా పండుగకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. దుర్గాదేవి మండపాలు, ఆలయాలు, రావణ దహనం జరిగే ప్రదేశాలు, ప్రజలు అధికంగా గు మి గూడే ప్రాంతాల వద్ద బందోబస్తు కొనసాగుతుందన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.


