జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన బాలె శ్రీకృష్ణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల పీడీ వెంకటలక్ష్మీ తెలిపారు. కొమురంభీంఆసిఫాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి అండర్–14 అథ్లెటిక్స్ పోటీల్లో శ్రీకృష్ణ పాల్గొంటారని తెలిపారు. శ్రీకృష్ణను హెచ్‌ఎం చంద్రశేఖర్, సర్పంచ్ జున్ను రాజేందర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ నీరటి సుకన్య, ఉపాధ్యాయులు అభినందించారు.
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామివారిని దేవాదాయ శాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు శనివారం సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈవో అంజనారెడ్డి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి.. ప్రసాదాలు అందించారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. టీటీడీ నిధులు రూ.35.19కోట్లతో చేపట్టే పనుల టెండర్ ప్రక్రియ పూర్తి అయిందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. స్వామివారి చందనోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఏఈఓ హరిహరనాథ్, సూపరింటెండెంట్ సునీల్, ప్రధాన అర్చకులు జితేంద్ర స్వామి, చిరంజీవస్వామి, మారుతి ప్రసాద్, స్థానాచార్యులు కపీందర్, ఆలయ పరిశీలకులు అశోక్ పాల్గొన్నారు.
పుష్కరాల పనులు వేగవంతం చేయాలి
ధర్మపురి: గోదావరి పుష్కరాల పనులను వేగవంతం చేయాలని దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు అధికారులను ఆదేశించారు. ఆలయం కార్యాలయంలో ఇరిగేషన్, దేవదాయశాఖ అధికారులతో సమీక్షించారు. అధికారులంతా కలిసికట్టుగా పనులను పూర్తిచేయాలని సూచించారు. ముందుగా శ్రీలక్ష్మినృసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్ స్వామివారి శేషవస్త్రం ప్రసాదాలు అందించారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఆయాశాఖల అధికారులు, ముఖ్య అర్చకులు, దేవస్థానం సిబ్బంది తదితరులున్నారు.


