‘ఎన్‌సీయూ’పై అలర్ట్‌..! | - | Sakshi
Sakshi News home page

‘ఎన్‌సీయూ’పై అలర్ట్‌..!

Oct 4 2026 8:26 AM | Updated on Oct 4 2026 8:26 AM

● ఎంసీహెచ్‌లో ప్రత్యేక పర్యవేక్షణ ● ఆదిలాబాద్‌ ‘రిమ్స్‌’ ఘటనతో అప్రమత్తం

జగిత్యాల: ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆస్పత్రిలో ఎన్‌సీయూ యూనిట్‌లో జరిగిన ప్రమాదంలో చిన్నారులు మృతిచెందడంతో జిల్లాలోని జనరల్‌ ఆస్పత్రుల్లో వైద్యులు అప్రమత్తమయ్యారు. జిల్లాకేంద్రంలోని ధరూర్‌ క్యాంప్‌లోగల ఎంసీహెచ్‌లో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. మాతాశిశు సంక్షేమ కేంద్రంలో ఉన్న న్యూబార్న్‌ కేర్‌ యూనిట్‌ (ఎన్‌సీయూ) నిర్వహణపై ఇప్పటికే వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఎంసీహెచ్‌లో ఉన్న యూనిట్‌లో ఏసీలు సక్రమంగా పనిచేస్తున్నాయా..? లేదా..? విద్యుత్‌ సక్రమంగా ఉందా..? లేదా..? అని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే రెండు ఏసీలను పూర్తిగా తీసి మరమ్మతు చేశారు.

నెలకు 300 ప్రసవాలు

జిల్లాకేంద్రంలోని మాతాశిశు సంక్షేమ కేంద్రంలో ప్రసవాల సంఖ్య గణనీయంగా ఉంటుంది. గతంలో 400కు పైగా ప్రసవాలు జరిగాయి. కొన్నిసార్లు 24 గంటల్లో 24 ప్రసవాలు అయ్యాయి. కొందరు నెలలు నిండకుండానే పుట్టడం, తక్కువ బరువు, శ్వాసకోశ, ఇతరత్రా అనారోగ్యం బారిన పడే చిన్నారులను ఎన్‌సీయూ యూనిట్‌లో చేర్చి వెంటిలేటర్లు, ఇతర అత్యాధునిక అత్యవసర వైద్యం అందిస్తుంటారు. ఇందులో తల్లిగర్భంలో ఉన్నట్లు వెచ్చదనాన్ని అందించే వార్మర్లు శిశువులు త్వరగా కోలుకోవడానికి ఎంతో దోహదపడుతాయి.

20 మంది శిశువుల సామర్థ్యం

జగిత్యాల జిల్లాకేంద్రం అయ్యాక ప్రత్యేకంగా ఎంసీహెచ్‌ ఏర్పడింది. ఇందులో ప్రస్తుతం 100కు పైగానే బెడ్లు ఉన్నప్పటికీ ప్రసవాలు అత్యధికంగా జరుగుతున్నాయి. అయితే 20 మంది చిన్నారులకు వైద్యం అందించే సామర్థ్యమున్న యూనిట్‌ మాత్రమే ఉంది. దీంతో కొంతమందిని వేరే చోటకు పంపించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.

యూనిట్‌పై పర్యవేక్షణ

ఎన్‌సీయూలో ఏసీలు, పల్స్‌బీపీ మానిటర్లు, ఫొటోథెరపీ వెంటిలేటర్లు, ఇంక్యుబేటర్లు, సిరంజీ పరికరాలు వంటి పరికరాలు పూర్తిస్థాయిలో విద్యుత్‌పై ఆధారపడి ఉంటా యి. విద్యుత్‌కు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా అందులో ఉన్న చిన్నారులకు ప్రమాదం పొంచి ఉంటుంది. ఏసీలు షార్ట్‌సర్క్యూట్‌ అయినా.. మానిటర్లకు ఎక్కువ కరెంట్‌ వచ్చినా.. ప్రాణాలకే ప్రమాదకరం. ఆదిలాబాద్‌ సంఘటన అనంతరం ప్రస్తుతం జగిత్యాలలో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. విద్యుత్‌కు సంబంధించిన పరికరాలన్నింటికి మరమ్మతు చేయించారు. ఎప్పటికప్పుడు సాంకేతిక లోపాలు తలెత్తకుండా విద్యుత్‌ పరికరాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. కేబుల్స్‌ను తనిఖీ చేస్తున్నారు. కొత్త కేబుల్స్‌ అమర్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

మరమ్మతు చేస్తున్న ఏసీలు

ఎన్‌సీయూలో చికిత్స పొందుతున్న చిన్నారులు

ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం

న్యూబార్న్‌ యూనిట్‌లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్‌ పరికరాలకు సంబంధించి అన్ని తనిఖీలు చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఏసీలు, మానిటర్లు అన్నింటిని పర్యవేక్షించాం. శిశువులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

– డాక్టర్‌ నరేశ్‌, ఆర్‌ఎంవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement