జగిత్యాల: జిల్లాలో 13,15,376 మంది ఆధార్ నమోదు నవీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఐదేళ్ల వయస్సున్న వారు 49,419 మంది, 6 నుంచి15 ఏళ్లవారు 2,34,451, అలాగే 18 ఏళ్లు పైబడిన వారు 10,31,512 మంది ఉన్నారని, వయసుల వారీగా ఆధార్ నమోదు పరిశీలించాలన్నారు. ఆరేళ్లు నిండిన చిన్నారులకు బయోమెట్రిక్ చేయాలన్నారు. వైద్య ఆరోగ్యం, విద్య, మహిళా శిశు సంక్షే మ శాఖ, ఆధార్ కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అదనపు కలెక్టర్ లత, రాజాగౌడ్, డీఎంహెచ్‌వో సుజాత పాల్గొన్నారు.
అటవీ భూములు పరిరక్షించాలి
జిల్లాలో అటవీ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. అటవీ సంరక్షణ కమిటీతో మంగళవారం సమావేశమయ్యారు. జిల్లాలో మొత్తం 53,734,77 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉందని, ఐదు రేంజ్‌లు, 22 సెక్షన్లు, 67 బీట్లు, 253 కంపార్ట్‌మెంట్ల పరిధిలో ఉందని, రెవెన్యూ రికార్డుల్లోని 22ఏ 1 పహాణి వివరాలు సరిపోల్చి రీకన్సిలియేషన్ చేయాలన్నారు. 22ఏ పహాణీ రికార్డుల్లో 57,842, 25 ఎకరాలు మరో విభాగంలో 75,198,14 ఎకరాలు నమోదైందని, ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అటవీ భూములపై హక్కులు కోరుతున్న గిరిజనులకు చట్టబద్ధమైన విధానంలో పరిష్కరించాలన్నారు. 20 ఏళ్లలో రెవెన్యూ అధికారుల ద్వారా 5,016,99 ఎకరాలు అనధికారికంగా పట్టాలు మంజూరైనట్లు తెలిపారు. అటవీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో భూ వివాదాలు లేకుండా చూడాలన్నారు. కోరుట్ల డివిజన్‌లో 91.28 ఎకరాలు వివాదంలో ఉన్నట్లు అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కలప అక్రమ రవాణాపై నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు.
కలెక్టర్ సత్యప్రసాద్


