జగిత్యాలటౌన్: రాష్ట్రంలో రౌడీపాలన సాగుతోందని, రేవంత్ రెడ్డి స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌లోనే రాష్ట్రంలో బీఆర్‌ఎస్ నాయకులపై దాడులు జరుగుతున్నాయని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంతతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నేరంతో సంబంధం లేకపోయినా అరెస్టు చేయడం.. సీసీ కెమెరాలు ఉండగానే కాంగ్రెస్ గుండాలు పోలీసులు గదిలోకి వెళ్లి దాడి చేయడాన్ని ఖండించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్‌ఓను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌లో దాడి చేయడం పరోక్షంగా కేటీఆర్‌పై దాడి చేసినట్లేనని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. దాడులకు పాల్పడిన గూండాలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా కేసీఆర్ హయాంలో ఎస్టీ రిజర్వేషన్లు పదిశాతానికి పెంచారని గుర్తు చేశారు. రిజర్వేషన్ కల్పించిన కేసీఆర్ చిత్రపటాలకు ఈనెల 17న ప్రతీ తండాలో క్షీరాభిషేకం చేయాలని పిలుపు నిచ్చారు.గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే రేవంత్ రెడ్డి గిరిజనుల హక్కులను కాలరాస్తూ బడ్జెట్‌ను కాగితాలకే పరిమితం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గూండా రాజకీయాలకు రోజులు దగ్గరపడ్డాయని, ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ఆయనవెంట నాయకులు కల్లపల్లి దుర్గయ్య, దేవేందర్ నాయక్, కొల్ముల రమణ, అబ్దుల్ బారీ, వెంకటేశ్వరరావు, వొల్లం మల్లేశం, జున్ను రాజేందర్, ఆనంద్‌రావు, గుండా మధు ఉన్నారు.
రేవంత్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌లోనే దాడులు
పోలీస్‌స్టేషన్‌లో జరిగిన దాడులను ఖండిస్తున్నాం
మాజీమంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి


