గొల్లపల్లి: పచ్చని పల్లె.. సరికొత్త సంకల్పంతో సరిహద్దులు దాటి ఆదర్శంగా నిలిచింది. రసాయన రంగుల హంగులు వద్దు.. మట్టి గణపతులకే తమ ఓటు అంటూ ఐక్యత చాటింది. మండలంలోని లక్ష్మీపూర్ గ్రామం వినాయక చవితి వేడుకల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఊరంతా ఒక్కటై పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది.
12 మండపాల్లో అన్నీ మట్టి విగ్రహాలే
గ్రామంలో ఈ ఏడాది నెలకొల్పిన 12 గణేష్ మండపాల్లో మట్టితో తయారు చేసిన ప్రతిమలనే ప్రతిష్ఠించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాలతో నీటి వనరులు కలుషితం అవుతున్నాయని గుర్తించిన గ్రామ పంచాయతీ.. ముందస్తుగానే మట్టి వినాయకులనే పూజిద్దామని గ్రామస్తులకు పిలుపునిచ్చింది. ఈ పిలుపునకు మండపాల నిర్వాహకులు, యువత, గ్రామ పెద్దలు స్వచ్ఛందంగా తలూపారు.
గ్రామానికి దక్కిన గౌరవం
గ్రామస్తుల నిర్ణయంపై సర్పంచ్ కాసం రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం పూజల మార్పు మాత్రమే కాదు.. రేపటి తరం కోసం ఊరు తీసుకున్న గొప్ప బాధ్యతాయుతమైన నిర్ణయమన్నారు. భవిష్యత్తు తరాలకు ఇదొక చక్కటి మార్గదర్శకమన్నారు. మీ సహకారం – మన గ్రామానికి గౌరవం అనే భావనతో ఊరి గౌరవాన్ని నిలబెట్టిన యువత, మండప నిర్వాహకులు, గ్రామపెద్దలకు కతజ్ఞతలు తెలిపారు. లక్ష్మీపూర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మండల ప్రజలు, అధికారులు కూడా ప్రశంసిస్తున్నారు.
12 మండపాల్లోనూ కొలువుదీరిన మట్టి వినాయకులే
పంచాయతీ పిలుపునకు జైకొట్టిన గ్రామస్తులు, యువత
సర్పంచ్ కాసం రాజశేఖర్ హర్షం


