కోరుట్ల: కాలంచెల్లిన లైసెన్స్‌తో టెండర్ వేసిన ఓ కాంట్రాక్టర్‌కు పనులు ఖరారు చేసిన వైనం కోరుట్ల మున్సిపాలిటీలో కలకలం రేపుతోంది. మున్సిపల్ అధికారుల పొరపాటుతో జరిగిందా..? కావాలని చేశారా..? అనే విషయం అంతుచిక్కడం లేదు. ఈ విషయమై ప్రజావాణిలో కలెక్టర్‌కు మరో కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయగా ఆయన విచారణకు ఆదేశించారు. అయినప్పటికీ బల్దియా అధికారుల తీరు మారలేదు. విచారణలో నిర్లక్ష్యం చూపడమే కాకుండా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన వ్యక్తికి నోటీసులు ఇచ్చి బెదరగొడుతున్న తీరు విస్మయం గొలుపుతోంది.
లైసెన్స్ కాపీని దిద్దారా..?
మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి కేటాయించిన రూ. 25 లక్షల విలువైన ఐదుచోట్ల సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్ నిర్మాణానికి ఏప్రిల్‌లో ఆన్‌లైన్ టెండర్లు ఆహ్వానించారు. పనుల కోసం ఇరువురు కాంట్రాక్టర్లు టెండర్ వేశారు. వీరిలో ఓ కాంట్రాక్టర్ తాను వేసిన కాంట్రాక్టు లైసెన్స్‌లో ఉన్న కాలపరిమితి తేదీని దిద్దినట్లు ఆన్‌లైన్‌లో స్పష్టంగా కనిపించినప్పటికి ఇంజినీరింగ్ అధికారులు సదరు వ్యక్తికే టెండర్లు ఖరారు చేశారు. వాస్తవానికి సదరు కాంట్రాక్టర్ లైసెన్స్ కాలపరిమితి 2026 ఫిబ్రవరిలో ముగిసింది. లైసెన్స్‌లో ఉన్న తేదీని 2026 ఆగస్టు వరకు పరిమితి ఉన్నట్లు దిద్ది తప్పుడు లైసెన్స్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని టెండర్ ప్రక్రియలో పాల్గొన్న మరో కాంట్రాక్టర్ గుర్తించి తప్పుడు లైసెన్స్‌తో కాంట్రాక్టు ఎలా ఖరారు చేశారని ఆగస్టులో మున్సిపల్ ఇంజినీరింగ్ అఽధికారులకు ఫిర్యాదు చేశారు. దానిని మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో వారంక్రితం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
నోటీసుల గోల్‌మాల్
కాలం చెల్లిన లైసెన్స్‌తో టెండర్లు ఖరారు చేసిన వైనంపై ఫిర్యాదు చేస్తే అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఫిర్యాదు చేసిన కాంట్రాక్టర్‌నే నోటీసులతో ఇబ్బంది పెట్టినట్లు తెలిసింది. తప్పుడు లైసెన్స్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన కాంట్రాక్టర్ మున్సిపాలిటీలో చేస్తున్న ఇతర పనులు సకాలంలో పూర్తి చేయడం లేదని, బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. పనులు చేయడానికి కాలపరిమితి ఉన్నప్పటికీ కావాలనే తనను ఇబ్బంది పెడుతున్నారని సదరు కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. కలెక్టర్‌కు ఫిర్యాదు అనంతరం మున్సిపల్ అధికారులు తప్పుడు లైసెన్స్ ఆన్‌లైన్‌లో పెట్టి టెండరు దాఖలు చేసిన కాంట్రాక్టర్‌ను వివరణ కోరినట్లు సమాచారం. ఈ విషయాన్ని మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్, డీఈ అరుణ్‌కుమార్ ధ్రువీకరించారు.


