● భూముల లెక్కలు పక్కాగా.. ● క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం ● డ్రోన్లతో చిత్రీకరణ పూర్తి..
జగిత్యాల: నక్ష.. గ్రామీణ ప్రాంతాల్లో అతి ముఖ్యమైంది. భూములకు హద్దులు, దారులు, ఇతరత్రాకు నక్ష ఏర్పాటు చేస్తారు. గ్రామాల్లో మాదిరిగానే పట్టణాల్లోనూ భూముల లెక్కలు పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ఇటీవల నక్ష అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సాగు భూములక మాత్రమే ఉండే నక్ష పట్టణాల్లోనూ పటాలను రూపకల్పన చేయాలని ఇటీవల ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మున్సిపాలిటీలు ఎంపికకాగా.. అందులో జగిత్యాల కూడా ఒకటి. సర్వే ఆఫ్ ఇండియా, మున్సిపాలిటీ, భూమి కొలతలు, దస్త్రాల నిర్వహణ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మొదట హెలికాప్టర్, డ్రోన్ల ద్వారా పట్టణం మొత్తం వ్యూ చిత్రీకరించారు. ప్రస్తుతం సర్వేయర్ల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించే పనులు మొదలయ్యాయి. ఇది పూర్తయ్యాక ఆర్వోఆర్ పట్టా ఇవ్వనున్నారు.
డ్రోన్లతో చిత్రీకరణ పూర్తి
జగిత్యాల మున్సిపాలిటీలోని అన్ని భవనాలను డ్రోన్లతో చిత్రీకరించారు. ప్రస్తుతం గ్రౌండ్‌ట్రూతింగ్ పనులను సర్వేయర్లు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రతి భవనం, ఆస్తులను కొలతలు చేయడంతో పాటు, వాటికి బౌండరీలు ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో పొందుపర్చుతారు. ప్రతి ఒక్క ఆస్తిని అక్షాంశాలు, రేఖాంశాలతో హద్దులు గుర్తించి సంబంధిత ఆస్తులకు ఆర్వోఆర్‌లో చేర్చి గుర్తింపు కార్డులు అందించనున్నారు. వీటితో పాటు, ప్రభుత్వ స్థలాలైన చెరువులు, ఆలయాలకు సంబంధించిన భూములను పొందుపర్చనున్నారు. తద్వారా వాటిని ఎవరూ కబ్జా చేసే అవకాశం ఉండదు. ఈ నక్షతో ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా ఎంతో ఉపయోగపడతాయి.
విస్తరిస్తున్న పట్టణం
జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో కోరుట్ల, జగిత్యాల ల్యాండ్‌రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు పంపించగా.. పైలెట్ ప్రాజెక్ట్ కింద జగిత్యాల ఎంపికవడంతో మేలు జరగనుంది. పైగా ఆక్రమణలకు అడ్డుకట్ట వేయవచ్చు. భూముల లెక్కలు పక్కాగా ఉండేందుకు నక్షలు ఆధారంగా ఉంటాయి.
50 వార్డులు.. లక్షకు పైగా జనాభా
జిల్లా కేంద్రమైన జగిత్యాల ఇక నుంచి నక్షతో కూడిన పట్టణంగా ఏర్పాటు కానుంది. ఇక్కడ ఎలాంటి కబ్జాలకు పాల్పడకుండా ఉంటుంది. మున్సిపాలిటీలో 50 వార్డులు, లక్షకు పైగా జనాభా ఉంది. దాదాపు 35 వేలకు పైగా గృహాలుంటాయి. వీటన్నింటిని డ్రోన్ల ద్వారా చిత్రీకరించి పట్టణ మ్యాప్ రూపొందించారు.
గ్రామాల విలీనంతో..
జగిత్యాల.. జిల్లాకేంద్రం కావడం, చుట్టూ 6 కిలో మీటర్ల మేర విస్తరించడం.. ఇటీవల కొన్ని గ్రామాలు బల్దియాలో విలీనం అయ్యాయి. దీంతోపాటు అక్రమాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో భూముల రక్షణ కోసం నక్ష ఏర్పాటు చేస్తున్నారు. నక్ష ద్వారా సమగ్ర సర్వే చేపట్టి భూములకు రక్షణ కల్పించనున్నారు. ఇది ప్రజల సొంత భూములతోపాటు, ప్రభుత్వ స్థలాల
పరిరక్షణకు ఎంతో ఉపయోగపడనుంది.


