వామ్మో.. ఫీజులు | - | Sakshi
Sakshi News home page

వామ్మో.. ఫీజులు

Jun 14 2026 7:10 AM | Updated on Jun 14 2026 7:10 AM

జగిత్యాల: పాఠశాలలు మరో రెండు రోజుల్లో పునఃప్రారంభం కానున్నాయి. ఇప్పటి నుంచే తల్లిదండ్రులు పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బుక్స్‌, ఇతరత్రా సామగ్రి కొనుగోలు చేయడంలో నిమగ్నమయ్యారు. విద్యార్థుల తల్లి దండ్రులు ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయిస్తుండడంతో ప్రైవేటు యాజమాన్యాలు వారి ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నాయి. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఆ ఫీజులను చూసి భయాందోళనకు గురవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ఉన్నప్పటికీ అంతస్థాయిలో లేద న్న భావన ప్రజల్లో ఉంది. దీంతో ప్రభుత్వ పాఠశాలకు పంపించేందుకు కొంత విముఖత చూపుతున్నారు. చేసేదేమీలేక అధిక ఫీజులు చెల్లించి అయినా ప్రైవేటులో చదివిపించేందుకే మొగ్గుచూపుతున్నారు. ఫీజుల నియంత్రణ లేకపోవడంతో మధ్య, పేద తరగతి ప్రజలను ఆసరాగా చేసుకుని ప్రైవేటు యజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైమరీ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చదువుకు కూడా తడిసిమోపెడవుతోంది. ఫస్ట్‌క్లాస్‌ నుంచి 10వ తరగతి వరకు రూ.లక్షల్లో ఫీజు అవుతోంది.

మధ్యతరగతి కుటుంబాలపై భారం

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చూసి మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఒక స్కూల్‌ ఫీజే కాకుండా పుస్తకాలు, పిల్లలకు యూనిఫాంతోపాటు, టై, బెల్ట్‌, షూలు కూడా యాజమాన్యాలే విక్రయిస్తూ వాటికి సపరేట్‌ ఫీజులు వసూలు చేస్తున్నాయి. చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునే వారికి ఫీజులు కట్టాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. కొంతమంది అప్పు చేసి మరీ చదివిస్తున్నారు. ఆటో, కారు, ప్రైవేటు కంపెనీల్లో చేసే ఉద్యోగుల పిల్లలను ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు. ప్రైవేటు యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చి అధిక ఫీజులతో తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పిల్లల భవిష్యత్‌ కోసం తల్లిదండ్రులు ఎంత ఫీజులైనాగానీ ఆర్థిక ఒత్తిడిని భరించి కడుతున్నారు. పిల్లలకు మంచి చదువు అందిస్తే వారి భవిష్యత్‌ బాగుంటుందనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు.

ఆకర్షణీయమైన పేర్లతో..

జిల్లాలో పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రులను ఆకట్టుకునేలా వివిధ సిలబస్‌లు అంటూ వారి మభ్యపెడుతున్నాయి. కొన్ని స్కూళ్లకు అనుమతి లేకున్నా ఈ టెక్నో, ఐఐటీ, డీజీ అని తోకలు తగిలిస్తూ పిల్లల నుంచి అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే ఆ పాఠశాలల్లో చెప్పే ఉపాధ్యాయులను ఆకర్షణీయ రూపంలో ప్రింట్‌ చేసిన బ్రోచర్లతో ఇంటింటికీ తిప్పుతూ ప్రచారం చేయిస్తున్నారు. స్కూళ్లలో జాయిన్‌ చేసుకుంటున్నారు. మొదట వారికి చదువు బాగుంటుందని, రకరకాలుగా వారిని మభ్య పెడుతూ స్కూళ్లలో జాయిన్‌ చేసుకుంటున్నారు.

ఫీజు కడితేనే హాల్‌టికెట్స్‌

మొదట నెలరోజులపాటు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయరు. అనంతరం ఎఫ్‌–1, 2, 3, 4 పరీక్షలంటూ వారికి ఫీజు కడితేనే హాల్‌టికెట్లు అంటూ ఒత్తిడి తెస్తున్నారు. పిల్లలు హాల్‌టికెట్స్‌ ఇవ్వ డం లేదంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో డబ్బులున్నా లేకున్నా ప్రైవే టు పాఠశాల యాజమాన్యాలకు చెల్లిస్తుంటారు.

వసతులు అంతంతే..

ప్రైవేటు పాఠశాలల్లో వసతులు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. కొందరు సిటీ మధ్యలో ఏర్పా టు చేయగా.. కొందరు శివారులో స్కూళ్లను ఏర్పా టు చేస్తున్నప్పటికీ పెద్దపెద్ద ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుంటూ క్లాస్‌రూమ్‌లను నిర్వహిస్తున్నారు. అందులో పిల్లలను ఇరుకు గదుల్లోనే క్లాసులు చెబుతున్నారు. కొన్ని స్కూళ్లయితే ఏకంగా సెల్లార్‌లోనే నిర్వహిస్తున్నారు. పేరున్న స్కూళ్లని ఈవిధంగానే చేపడుతున్నారు. ఫైర్‌ సేఫ్టీ గానీ, ప్లేగ్రౌండ్స్‌గానీ ఇక్కడ ఉండవు. వీటిపై విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలు వ్యాపార సంస్థలుగా మారిపోయాయి. నిర్దేశించిన ధరలకంటే ఎక్కువ ధరలు నిర్ణయించి అందినంతా దోచుకుంటున్నారు.

నిబంధనలు ఎక్కడ..?

ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో ప్రకారం ప్రైవేటు బడిల్లో విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీఏర్పాటు చేయడంతోపాటు, వసూలు చేసిన ఫీజులో 5 శాతం స్కూల్‌ యాజమాన్యం కింద.. 15శాతం పాఠశాల నిర్వహణ, 15 శాతం స్కూల్‌డెవలప్‌మెంట్‌, 15శాతం సిబ్బంది ప్రయోజనాలు, 50 శాతం వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధికారులు స్పందించి ఫీజులు తగ్గించేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు

ఏటేటా పెంచుతున్న యాజమాన్యాలు

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న పాఠశాలలు

వ్యాపారమయంగా మార్చిన విద్య

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement