ఆహ్లాదం.. అందనంతదూరం | - | Sakshi
Sakshi News home page

ఆహ్లాదం.. అందనంతదూరం

Jun 3 2026 11:38 PM | Updated on Jun 3 2026 11:38 PM

● పనిచేయని ఫౌంటేన్లు ● రూ.లక్షలాది నిధులు వృథా ● మరమ్మతులతోనే సరి ● పట్టని అధికారులు

ఇది జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్‌ చౌరస్తా. ఏ కార్యక్రమం అయినా ఇక్కడే చేపడతారు. జంక్షన్‌లో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం, దేశ చిత్రపటం ఏర్పాటు చేసి.. చుట్టూ లాన్‌, ఫెన్సింగ్‌, ఫౌంటేన్‌ ఏర్పాటు చేశారు. నిర్వహణ గాలికొదిలేయడంతో పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఎండకాలం కావడంతో మొక్కలు ఎండిపోతున్నాయి.

జగిత్యాల: జగిత్యాల జిల్లాకేంద్రంగా ఏర్పడి 9 ఏళ్లు గడుస్తోంది. కానీ అభివృద్ధి మాత్రం నత్తనడకన సాగుతోంది. గతంలో సుందరీకరణ పేరుతో డివైడర్ల మధ్య మొక్కలు నాటారు. జంక్షన్ల వద్ద అత్యంత ఖరీదైన బొమ్మలు, లాన్‌ నిర్మించారు. కానీ.. అవన్నీ కొద్దిరోజులు మాత్రమే పనిచేశాయి. గత పాలకవర్గంగానీ, అధికారులు గానీ పట్టించుకోకపోవడంతో జంక్షన్లు కళావిహీనంగా మారుతున్నాయి. బొమ్మలు దుమ్ముపట్టాయి. లాన్‌ ఎండిపోయింది.

కొత్త పాలకవర్గంపైనే ఆశలు

కొత్త పాలకవర్గం పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని చెబుతున్నా.. పట్టణ సుందరీకరణపై పట్టింపులేదని ఆరోపణలున్నాయి. జంక్షన్లను పూర్తిస్థాయిలో మరమ్మతు చేయకపోవడంతో పనిచేయడం లేదు.

ప్రజాధనం దుర్వినియోగం

జిల్లాకేంద్రానికి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్లు, జంక్షన్లు పచ్చగా ఉండాలన్న ఉద్దేశంతో సుందరీకరణ పేరుతో గతంలో రూ.35లక్షలతో బొమ్మలు, లాన్‌, ఇతరత్రా ఏర్పాట్లు చేశారు. నెమలి, కొంగలు, మనిషి ఆకారం పోలే బొమ్మలు పెట్టించారు. కనీసం రెండు నెలలైనా ఫౌంటేన్ల నిర్వహణ సాగలేదు. రూ.35 లక్షల నిధులు వృథా అయ్యాయి. ఫౌంటేన్లు పనిచేయాలంటే మోటార్లు ఉండాలి. అవి చెడిపోవడంతో బాగు చేసే విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు మరమ్మతు చేపడితే రెండు రోజులు మాత్రమే పనిచేస్తున్నాయి. మొక్కుబడిగా ట్యాంకర్ల ద్వారా నీరు పడుతున్నారుగా తప్ప మోటార్లు బాగుచేసి ఫౌంటేన్‌ పనిచేసేలా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. జిల్లాకేంద్రంలో పరిస్థితి ఇలా ఉంటే కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి బల్దియాల్లో జంక్షన్ల ఊసే ఎత్తడం లేదు. అక్కడ కూడా జంక్షన్లు ఏర్పాటు చేసేలా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

ఖర్జూర చెట్ల స్థానంలో ఈత చెట్లు

గత పాలకవర్గం హయాంలో కొత్తబస్టాండ్‌ నుంచి పార్క్‌ వరకు డివైడర్ల మధ్య సుందరీకరణ పేరుతో దాదాపు రూ.12 లక్షలు వెచ్చించి ఖర్జూర మొక్కలు నాటారు. వాస్తవానికి అవి ఈత చెట్లు. ఇది పలు విమర్శలకు దారితీసింది. ఖర్జూర మొక్కల స్థానంలో ఈత మొక్కలు తెప్పించారని, వాటి ఖరీదు తక్కువగా ఉంటుందని, ఇందులో అవినీతికి పాల్పడ్డారని అప్పటి పాలకవర్గంపై విమర్శలు చేస్తున్నారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది జిల్లాకేంద్రంలోని పాతస్టాండ్‌ చౌరస్తా. ఇక్కడి జంక్షన్‌ వద్ద సుందరీకరణ పేరిట అందమైన బొమ్మలు, లాన్‌, ఫౌంటేన్‌ ఏర్పాటు చేశారు. కానీ.. ఇప్పటివరకు పనిచేయడం లేదు. వేసవి కావడంతో పది రోజుల క్రితం మరమ్మతు చేపట్టారు. ఫౌంటేన్‌ ఒకరోజు మాత్రమే నీరు పోసింది. సుందరీకరణ చేపడతామన్న అధికారులు, ప్రజాప్రతినిధులు వీటిని గాలికొదిలేశారు. లాన్‌ ఎండిపోయింది. బొమ్మలు శిథిలావస్థకు చేరాయి.

Advertisement
 
Advertisement
Advertisement