కథలాపూర్: ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు అందుబాటులో లేక.. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షలా మారుతోంది. పదోతరగతి పూర్తి చేసిన తర్వాత పైచదువులకు దూరప్రాంతాలకు వెళ్లాల్సి రావడం ఆర్థికంగా భారమవుతోంది. సరిపడా రవాణా సదుపాయం లేకపోవడం ఇబ్బందిగా మారుతోంది. ఫలితంగా చాలామంది ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. కథలాపూర్ మండలంలో ఏటా పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు.. ఇంటర్, డిగ్రీ చదువులకు వెళ్లేవారి సంఖ్యకు చాలా తేడా కనిపిస్తోంది.
ఏటా 500కు పైగా టెన్త్ విద్యార్థులు..
మండలంలో 19 గ్రామాలున్నాయి. వీటి పరిధిలో 10 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. ఏటా 500కు పైగా విద్యార్థులు పదోతరగతి పాస్ అవుతున్నారు. గతేడాది 511 మంది విద్యార్థుల్లో బాలురు 240 మంది, బాలికలు 271 మంది ఉన్నారు. అయితే కథలాపూర్‌లో ఒక్కటే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. ఇందులో ఇంటర్‌లో 150 మందికి మాత్రమే అడ్మిషన్ ఇస్తున్నారు. మోడల్ స్కూల్‌లో సుమారు 120 మంది విద్యార్థులు ఇంటర్‌లో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఆయా గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడం, ఆటోలు, జీపులకు అధిక ఛార్జీలు చెల్లించాల్సి రావడంతో విద్యార్థినులు ఇంటర్‌లో చేరేందుకు భయపడుతున్నారు. ఫలితంగా ఇంటర్‌లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందని ప్రజలు పేర్కొంటున్నారు. మండలంలో డిగ్రీ కళాశాల లేకపోవడంతోనూ పై చదువులకు దూరంలో ఉన్న కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలకు వెళాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు దూరభారం
మండలకేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో తుర్తి, పోతారం, ఇప్పపెల్లి, అంబారిపేట గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల విద్యార్థులు ఉదయం జూనియర్ కళాశాలకు చేరుకోవడం.. సాయంత్రం ఇంటికి చేరడానికి నరకయాతన పడుతున్నారు. మారుమూల గ్రామాలైన చింతకుంట, రాజారాంతండా, పెగ్గెర్ల, ఊట్‌పెల్లి, భూషణరావుపేట గ్రామాల విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రతీరోజు ఆటోల్లో ఒకొక్కరు రూ. 60 నుంచి రూ.80 వరకు ఖర్చు చేయాల్సి రావడం విద్యార్థులకు భారంగా మారుతోంది. మండలంలో పలు గ్రామాలకు కూడలిగా ఉన్న తాండ్య్రాల చౌరస్తా, గంభీర్‌పూర్ గ్రామాల్లో ఏదో ఒకచోట కొత్తగా జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కథలాపూర్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే మండల విద్యార్థులకు ఉన్నత విద్య మరింత చేరువవుతుందని విద్యాభిమానులు అంటున్నారు. అధికారులు చొరవ చూపి కళాశాలల సమయానికి అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
కిక్కిరిసిన ఆర్టీసీ బస్సులో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్న విద్యార్థులు
ఆటోలో సామర్థ్యానికి మించి
ప్రయాణిస్తున్న విద్యార్థులు(ఫైల్)


