రైతును నిండా ముంచిన నల్లమచ్చ కొనేందుకు ఆసక్తి చూపని పొరుగు రాష్ట్రాల వ్యాపారులు నష్టపోతున్న అన్నదాతలు
కోరుట్ల: మామిడి రైతుల ఆశలను నల్లమచ్చ మరక ముంచేసింది. ఫలితంగా ఈ సీజన్‌లో మామిడి రైతులు, స్థానిక వ్యాపారులు తీవ్రంగా నష్టపోయాల్సిన దుస్థితి వచ్చింది. మామిడికి ప్రత్యేకమైన బ్రాండ్‌గా గుర్తింపు ఉన్న జిల్లాలో ఈయేడు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వేల టన్నులు రావాల్సిన దిగుబడి సగానికి దిగజారింది. తెగుళ్లతో మార్కెట్‌లోనూ ధర పలకకపోవడం మరో దెబ్బగా మారింది.
పూత.. కాత దశలోనే
మెట్‌పల్లి, జగిత్యాల, కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, మల్యాల, రాయికల్ ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో మామిడి తోటలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 17వేల ఎకరాల్లో తోటలు సాగవుతున్నాయి. ఈసారి పూత దశలోనే తేనెమంచు తెగులు వ్యాపించడతో చాలామేర పూత రాలిపోయింది. సగం వరకు పూత రాలిపోయి కాయగా మారలేకపోయింది. ఎకరాకు 4 నుంచి 6 టన్నుల కాయ వచ్చే పరిస్థితి నుంచి 2 నుంచి 3 టన్నులకు పడిపోయింది. మళ్లీ పిందె దశలో మసి మంగు మచ్చ తెగులు విస్తరించింది. ఈ తెగులు నుంచి కాయను రక్షించేందుకు కాయలకు తొడుగులు వేయాల్సి ఉండగా.. ఆ దిశలో రైతులను అప్రమత్తం చేసేవారు లేకుండా పోయారు. సబ్సిడీ కింద ప్రభుత్వం అందించే తొడుగులను కాయలకు అమర్చడంలో జరిగిన నిర్లక్ష్యం ఫలితంగా అనేక తోటల్లో నల్లమచ్చ తెగులు విస్తరించింది.
కనిపించని ఇతర ప్రాంతాల వ్యాపారులు
జగిత్యాల మామిడి బ్రాండ్ ఇమేజ్ ఫలితంగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్తాన్ టోకు వ్యాపారులు సీజన్ మొదలు కాగానే వ్యాపారం కోసం వచ్చారు. అయితే నల్లమచ్చలతో కూడిన మామిడి కాయలు రావడంతో నాణ్యత సరిగా లేదని చెప్పి సదరు వ్యాపారులు ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఫలితంగా ఈ ప్రాంతంలో మామిడి తోటలను గుత్తకు తీసుకున్న వ్యాపారులు పండ్లు కొనుగోలు చేసే వారు లేక తీవ్ర నష్టాలకు గురయ్యారు. అదే సమయంలో గుత్తదారులు రైతులకు ఒప్పందం మేరకు డబ్బులు చెల్లించలేకపోయారు. మొత్తంగా రైతులు అమ్ముడు కాని పండ్లను నిల్వ ఉంచలేక.. కుళ్లిపోయేవాటిని కాపాడలేక తెగనమ్ముకుంటున్నారు. కిలో రూ.5 నుంచి రూ.15లోపే విక్రయిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ఈ సీజన్‌లో రైతులతో పాటు మామిడి పంటను నమ్ముకున్న స్థానిక వ్యాపారులు తీవ్ర నష్టపాలయ్యారు.
కోరుట్లలో మామిడి వ్యాపారుల వద్ద
నిల్వ ఉన్న మామిడి కాయలు
మామిడిపై నల్లమచ్చలు


