పుష్కరాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి | - | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి

Jun 3 2026 11:38 PM | Updated on Jun 3 2026 11:38 PM

జగిత్యాల: గోదావరి పుష్కరాలకు బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌తో కలిసి బుధవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. పుష్కరఘాట్లను విస్తరించడంతోపాటు, అవసరమైన చోట్ల కొత్తవి నిర్మించాలన్నారు. ధర్మపురి ఆలయం సమీపంలో హెలిప్యాడ్‌, రహదారులు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కోటిలింగాలు, ధర్మపురిలో పుష్కరాల కోసం ప్రభుత్వం మొదటి విడత రూ.117 కోట్లు విడుదల చేసిందని, ఇరిగేషన్‌ శాఖ ద్వారా రూ.16.10 కోట్లు, పంచాయతీ శాఖ ద్వారా రూ.8 కోట్లు, ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లు, మొత్తం రూ.34.10 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆర్డీవో మధుసూదన్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముందుగా కేంద్ర సామాజిక న్యాయ సాధికారిక మంత్రి వీరేంద్ర నాథ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా.. రాష్ట్రంలో 181 హాస్టళ్లు అద్దె ఇళ్లలో నిర్వహిస్తున్నామని, పక్కా భవనాలకు నిధులు కేటాయించాలని కోరారు.

రూ.వంద కోట్లతో పుష్కర పనులు

వెల్గటూర్‌: గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం తొలి విడతగా రూ.100 కోట్లు విడుదల చేసిందని మంత్రి అడ్లూరి తెలిపారు. వివిధ శాఖల అధికారులతో కలిసి కోటిలింగాల వద్ద పుష్కర ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. వెల్గటూర్‌ నుంచి రాజక్కపల్లె వరకు బైపాస్‌ నిర్మించాలన్నారు. అయ్యప్ప స్వామి ఆలయం వద్ద బోటింగ్‌ సౌకర్యం కల్పించాలని, కోటిలింగాల నుంచి పాశిగామ వరకు రోడ్డు నిర్మించాలని సూచించారు. ఏడాది ముందు నుంచే పనులు పూర్తి చేయాలని తెలిపారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, నాయకులు ప్రతాప్‌రావు, మురళి, ఉదయ్‌, శ్రీకాంత్‌రావు, మేరుగు నరేష్‌, పూదరి రమేష్‌, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement