గోడు వినండి.. గోస తీర్చండి | - | Sakshi
Sakshi News home page

గోడు వినండి.. గోస తీర్చండి

May 12 2026 12:38 AM | Updated on May 12 2026 12:38 AM

ప్రజావాణికి తరలివచ్చిన బాధితులు అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌ సత్వర పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు

జగిత్యాలటౌన్‌: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌ బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమస్యలపై సమగ్ర విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

హద్దులు తొలగించాడు

మాది జగిత్యాల రూరల్‌ మండలం గుట్రాజ్‌పల్లి. శివారులోని సర్వేనంబర్‌ 109లో మాకు 50గుంటల వ్యవసాయ భూమి ఉంది. మా భూమిని ఆనుకునే సర్వేనంబర్‌ 110 ఉంది. అందులో భూమి ఉన్న ఆంజనేయులు రోడ్డుకున్న హద్దులు తొలగించాడు. రెవెన్యూ అధికారులు, పోలీసులను ఆశ్రయించినా న్యాయం చేయడం లేదు. విచారణ చేపట్టి రోడ్డు హద్దు ఖనీలు ఏర్పాటు చేయించండి.

– పయ్యావుల రమేశ్‌, గుట్రాజ్‌పల్లి

ఇందిరమ్మ ఇల్లు పునరుద్ధరించండి

మాది కోరుట్ల మండలం సంగెం. ఇదిరమ్మ ఇల్లు మంజూరైంది. ప్రొసీడింగ్‌ అందాక పిల్లర్ల వరకు నిర్మించుకున్నాం. బిల్లు కోసం వేచి చూస్తుండగా.. మాకు ఫోర్‌ వీలర్‌ (టాటాఏస్‌) ఉందంటూ ఇల్లును రద్దు చేశారు. నిరుపేదలమైన మేం ఆటోతో జీవనోపాధి పొందుతున్నాం. ఆటోను సాకుగా చూపి ఇల్లు రద్దు చేశారు. విచారణ చేపట్టి ఇంటిని పునరుద్ధరించండి.

– బోయపల్లి మహేశ్వరి, సంగెం

ఎఫ్‌టీఎల్‌ హద్దులు పెట్టండి

జిల్లాకేంద్రానికి ఆనుకుని ఉన్న మోతె పెద్ద చెరువుపై ఆధారపడి 125 మత్య్సకార కుటుంబసభ్యులం జీవనం సాగిస్తున్నాం. కబ్జాదారులు చెరువులో మట్టిపోస్తూ చదును చేస్తూ చెరువును రోజుకింత చొప్పున ఆక్రమిస్తున్నారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చెరువుకు ఎఫ్‌టీఎల్‌కు హద్దులు ఏర్పాటు చేసి ఆక్రమణలు జరగకుండా చూడండి.

– మోతె మత్య్సకారులు

ప్రభుత్వ భూమిలో ఇళ్లు

మా గ్రామ పరిధిలోని సర్వేనంబర్‌ 85 ప్రభుత్వ భూమిలో కొందరు అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. భూకబ్జాపై విచారణ జరిపించి ప్రభుత్వ భూమిని కాపాడండి. అక్రమార్కులపై చర్యలు తీసుకోండి.

– సాయికుమార్‌, తుమ్మెనాల, ధర్మపురి

Advertisement
 
Advertisement
Advertisement