కథలాపూర్: రాష్ట్రవ్యాప్తంగా కుక్కల బెడద నేపథ్యంలో ప్రతి గ్రామంలో ఎన్ని శునకాలు ఉన్నాయో వివరాలు సేకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల్లో కుక్కలను లెక్కించారు. ఇంటింటికీ వెళ్లి పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, అందులో టీకాలు ఇప్పించినవి.. రోగాలతో బాధపడుతున్నవి.. కు.ని టీకాలు ఇప్పించినవి లెక్కించి ఈ– పంచాయత్ యాప్‌లో నమోదు చేశారు. అయితే లెక్కింపు సిబ్బందిని చూసి కుక్కలు వేరే వాడల్లోకి పరుగెత్తాయని పలువురు కార్యదర్శులు పేర్కొంటున్నారు. ఫలితంగా లెక్కల సేకరణకు నానా తంటాలు పడాల్సి వచ్చిందంటున్నారు.
385 గ్రామాలు.. 23,390 కుక్కలు
జిల్లాలో 385 గ్రామాలు ఉన్నాయి. అందులో 23,390 కుక్కలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో మగ 11,864, ఆడ 11,526 ఉన్నాయి. తల్లి కుక్కలు 2,465, చిన్నవి 5,630 ఉన్నాయని పంచాయతీరాజ్ శాఖ రికార్డుల్లో నమోదైంది. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి మదన్‌మోహన్ మాట్లాడుతూ.. అధికారుల ఆదేశాల మేరకు 385 గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందితో కుక్కల గణన చేయించామని, వాటి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించామని పేర్కొన్నారు.


