జగిత్యాలరూరల్/జగిత్యాలఅగ్రికల్చర్: వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం జగిత్యాల మండలం చల్‌గల్‌లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. కేంద్రాలకు వచ్చిన వరిధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ధాన్యం తూకం, నిల్వ, రవాణా ప్రక్రియల్లో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అకాల వర్షాలు ఉన్నందున గన్ని సంచులు, టార్ఫలిన్‌లు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ఆయన వెంట ఆయా శాఖల అధికారులు ఉన్నారు.
గోదాం వద్ద భద్రత పటిష్టంగా ఉండాలి
జగిత్యాల: ఈవీఎం గోదాం వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం ఈవీఎం గోదాంలను పరిశీలించారు. సీసీకెమెరాల పనితీరు, సాంకేతిక పరమైన అంశాలు సమగ్రంగా ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. అదనపు కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, ఏవో కిషన్, అర్బన్ తహసీల్దార్ రాంమోహన్ ఉన్నారు.


