అటు విజిలెన్స్, ఇటు ఏసీబీ దాడులు జగిత్యాల బల్దియా అధికారుల్లో గుబులు ఎమ్మెల్యే వద్దకు అధికారుల పరుగులు వేటు పడేది ఎవరిపైనో..?
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీ అవినీతిమయంగా మారింది. ప్రతి పనికోరేటు నిర్ణయిస్తూ బల్దియా సిబ్బంది అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తడంతో అటు విజిలెన్స్, ఇటు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దీంతో మున్సిపల్‌లో పనిచేస్తున్న అధికారుల్లో గుబులు పట్టుకుంది. ఒకవైపు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం, అధికారులు దాడులు చేస్తూ.. రికార్డులను పరిశీలించడం బల్దియాలో షరా మామూలుగా మారింది. గతేడాది డిసెంబర్‌లో 18 మంది విజిలెన్స్ అధికారులు వచ్చి ప్రతి విభాగాన్ని పరిశీలించారు. దాదాపు అన్ని విభాగాల్లోనూ అవినీతి జరిగిందని నిర్ధారించారు. కొన్ని విభాగాల సిబ్బందిని రీజినల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయానికి కూడా పిలిపించారు. తాజాగా ఏసీబీ దాడులు జరిగాయి. మున్సిపాలిటీలోని రెవెన్యూ విభాగం, టౌన్‌ప్లానింగ్ విభాగం, శానిటేషన్, ఇంజినీరింగ్ సెక్షన్‌లోని ప్రతి ఒక్క ఫైల్‌ను పట్టుకెళ్లారు. పూర్తిస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. రెవెన్యూ విభాగంలో ముటేషన్లకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. అలాగే పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యంగా ఉండటం, కార్మికుల పీఎఫ్, డీఏలను పట్టించుకోకపోవడం, స్టేషనరీ బిల్లులు చేయకపోవడం వంటి అవకతవకలను గుర్తించారు. గతంలో శానిటేషన్ విభాగంలో ట్రేడ్ లైసెన్స్‌లు, డీజిల్ కొనుగోళ్లకు సంబంధించి అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఇంజినీరింగ్ సెక్షన్‌లో వాటర్ చార్జీలు, టెండర్‌కు సంబంధించి సక్రమంగా లేవని, అలాగే మున్సిపల్ కాంప్లెక్స్‌లకు సంబంధించి టెండర్లు వేయలేదని గుర్తించారు. ఇలా ప్రతి ఒక్క ఫైల్‌ను పరిశీలించి అనంతరం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి విభాగానికి చెందిన అన్ని ఫైల్స్ పట్టుకెళ్లడంతోపాటు, ఇంటి అనుమతులు, ఇతరత్రా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజల ఫోన్ నంబర్లను తీసుకెళ్లారు. దరఖాస్తు చేసుకున్న వారికి నేరుగా ఫోన్ చేసి దరఖాస్తు ఎంత వరకు వచ్చింది..? చేస్తున్నారా..? లేదా..? అని అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ప్రతి విభాగంలో నిర్లక్ష్యంతో పాటు, అవినీతి అత్యధికంగా జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. విజిలెన్స్ అధికారులు పలుమార్లు దాడులు నిర్వహించినా పెద్దగా చర్యలు చేపట్టకపోవడం. ఏసీబీ అధికారులు తాజాగా తనిఖీలు చేయడంతో బల్దియా సిబ్బందిలో వణుకు పుడుతోంది.
గాడిన పడేనా..?
మున్సిపాలిటీకి ఇటీవలే కొత్తగా పాలకవర్గం ఏర్పడింది. చైర్‌పర్సన్‌గా సమిండ్ల వాణి ఎన్నికయ్యారు. ఈ క్రమంలో అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన మున్సిపాలిటీని గాడిన పెట్టాల్సిన బాధ్యత కొత్త పాలకవర్గంపై ఉంది. రెవెన్యూ, శానిటేషన్, టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ సెక్షన్, ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్లపై ప్రత్యేక దృష్టి సారించి గాడిన పెట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
దీర్ఘకాలిక సెలవులో అధికారులు..?
ఏసీబీ అధికారుల దాడులతో ఆందోళన చెందిన మున్సిపల్ అధికారులు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లనున్నట్లు తెలిసింది. ముందుగానైతే ఎమ్మెల్యేను కలిసి వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఒకవేళ తమపై ఎలాంటి చర్యలున్నా.. దీర్ఘకాలిక సెలవుపై వెళ్తామని చెప్పినట్లు సమాచారం.
అధికారుల్లో గుబులు..
ఏసీబీ అధికారులు దాడులు చేసి ప్రతి విభాగంలోని ఫైల్స్ తీసుకెళ్లి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న వారికి నేరుగా ఫోన్ చేసి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరైనా డబ్బులు అడిగినట్లు తెలిసినా, ఇంకేదైనా సమాచారం ఇచ్చినా అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏసీబీ అధికారులు నేరుగా సీడీఎంఏకే ఫైల్స్‌ను పంపించనున్నారు. సీడీఎంఏ అధికారులు ఒకవేళ ఏదైనా అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత శాఖ అధికారులను సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది.
మొదటి
నుంచి
ఆరోపణలే..
జగిత్యాల బల్దియాలో మొదటి నుంచే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూ కుంభకోణానికి సంబంధించి గతంలో కమిషనర్, ఆర్వో జైలుకెళ్లగా టౌన్‌ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న టీపీవో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇటీవలే ఓ బిల్‌కలెక్టర్ ఏకంగా ఆస్తిపన్ను డబ్బులు సొంతానికి వాడుకోగా సస్పెండ్‌కు గురయ్యాడు. అలాగే కొన్ని కీలక శాఖల్లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


