జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లా పూర్తిగా వ్యవసాయాధారితం. సాగునీటి వనరులు పుష్కలంగా ఉండటంతో గతేడాది అన్ని పంటలూ పుష్కలంగా పండాయి. తద్వారా పండించిన రైతులతోపాటు పంటను అమ్మించే మార్కెట్ కమిటీలకూ భారీగా ఆదాయం సమాకూరింది. లక్ష్యాన్ని మించి అత్యధికంగా ఆదాయం సంపాదించిన మార్కెట్లలో మొదటి స్థానంలో ధర్మపురి, చివరి స్థానంలో కోరుట్ల మార్కెట్ నిలిచింది.
13 వ్యవసాయ మార్కెట్ కమిటీలు
జిల్లాలో జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, గొల్లపల్లి, ధర్మపురి, మల్యాల, కథలాపూర్, మేడిపల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, పెగడపల్లి, వెల్గటూర్, రాయికల్ కలిపి 13 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఈ యార్డులకు రైతులు తమ పంట ఉత్పత్తులను తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. కొనుగోలు చేసిన వ్యాపారులు ఉత్పత్తుల విలువపై ఒక శాతం మార్కెట్ ఫీజు చెల్లిస్తుంటారు. గ్రామాల్లో నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసినప్పటికీ.. సదరు వ్యాపారులు సంబంధిత మార్కెట్ కమిటీకి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే సివిల్ సప్‌లై, మార్క్‌ఫెడ్ వంటి సంస్థలు కూడా మార్కెట్ ఫీజు చెల్లిస్తుంటాయి.
ఉత్పత్తులతోనే ఆదాయం
జిల్లాలో ప్రతి సీజన్‌లో కనీసం 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుంటాయి. ఇందులో 3 లక్షల ఎకరాల్లో వరి ఉంటుంది. వానాకాలం, యాసంగి సీజన్‌లో దాదాపు 10 నుంచి 12లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. మొక్కజొన్న కూడా రెండు సీజన్లలో కలిపి దాదాపు 10నుంచి12 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ పంటలతోపాటు కందులు, పెసలు, అలిసెంద, నువ్వులు, పత్తి, పసుపు ఉత్పత్తులు విక్రయిస్తుంటారు. కొన్నేళ్లుగా జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల మార్కెట్ కమిటీలకు మామిడికాయల అమ్మకం ద్వారా మార్కెట్ ఫీజు కూడా బాగానే వస్తోంది. ఇతర జిల్లాల్లో రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పటికీ అక్కడ మార్కెట్ ఫీజు చెల్లించలేదంటే చెక్ పోస్టుల ద్వారా ఫీజు వసూలు అవుతుంది. ఇలా ఒక్కో మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో 2 నుంచి 3 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
లక్ష్యాన్ని మించి ఆదాయం
ఐదేళ్లలో సాధించిన ఆదాయం ప్రకారం మార్కెట్ కమిటీలకు ఏటా లక్ష్యాన్ని నిర్ధేశిస్తుంటారు. ఈ సారి జిల్లాలోని మార్కెట్ కమిటీలు లక్ష్యాన్ని మించి ఆదాయాన్ని సంపాదించి పెట్టాయి. ఒక్క కోరుట్ల మార్కెట్ మాత్రమే వెనుకబడింది. మొత్తం రూ.21.22 కోట్ల లక్ష్యానికి రూ.26.60 కోట్ల ఆదాయం (125.34 శాతం)సాధించాయి.
మార్కెట్ లక్ష్యం ఆదాయం శాతం
జగిత్యాల 3.08 3.09 106.16
మెట్‌పల్లి 2.25 2.47 109.94
కోరుట్ల 1.86 1.51 81.49
గొల్లపల్లి 1.17 1.66 142.37
ధర్మపురి 2.39 3.82 159.70
మల్యాల 2.31 2.98 128.89
కథలాపూర్ 1.54 2.20 143.10
మేడిపల్లి 1.42 2.06 145.03
మల్లాపూర్ 1.04 1.30 125.41
ఇబ్రహీంపట్నం 0.68 0.70 101.65
పెగడపల్లి 1.03 1.43 138.90
వెల్గటూర్ 1.53 2.23 145.62
రాయికల్ 0.89 1.10 124.55
మొత్తం 21.22 26.60 125.34


