రెండో నమూనా ప్రకారం
సాక్షిప్రతినిధి,కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బాసర ఆలయ పునర్నిర్మాణానికి పూనుకుంది. ఈ నిర్మాణానికి శిలలు వినియోగించనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని సరస్వతీ భక్తులంతా ఆహ్వానిస్తున్నారు. అదే సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇలవేల్పు, దక్షికాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మాత్రం సిమెంటుతో పునర్నిర్మాణం జరపడంపై భక్తులు పెదవి విరిస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత పురాతన ఆలయాల్లో రాజన్న ఆలయం ఒకటి. 1800 సంవత్సరంలోనే తిరుపతి ఆలయంతో సమానంగా ఆదా యం ఉన్న ఏకై క దేవాలయం. అలాంటి ఆలయ పునర్నిర్మాణంలో ప్రభుత్వం సిమెంటు వాడుతుండడం వివక్షే అని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
సర్వత్రా అసంతృప్తి
వందలాది ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయ గోపురం పునర్నిర్మాణంలో భాగంగా పనులు ప్రారంభించినప్పటికీ ప్రస్తుత పాలకులు నిర్మాణ పనుల్లో నాటి చరిత్ర లేకుండా సిమెంట్ స్తంభాలతో పనులు జరపడాన్ని రాజన్న భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని నాటి పాలకులు చెప్పినప్పటికీ అది ఆచరణలో సాధ్యం కాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆలయ పునర్నిర్మాణానికి నడుం బిగించింది. సిమెంటుతో కూడిన స్తంభాల నిర్మాణంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.
6 బ్లాకులు...314 సిమెంట్ పిల్లర్లు
రాజన్న ఆలయ పునర్నిర్మాణంలో గతంలో ఇంజినీరింగ్, స్థపతులు, నిర్మాణ నమూనాను పరిశీలించి ధ్రువీకరించారు. ఆ నమూనాలో భాగంగా ఆలయాన్ని వెయ్యి ఫైల్ ఫౌండేషన్లతో నిర్మించాల్సి ఉండేంది. ఒక్కో ఫైల్ ఫౌండేషన్ సుమారు 10 నుంచి 12 మీటర్ల లోతుతో ఫౌండేషన్ వేసి ఆలయ నిర్మాణం పటిష్టంగా చేయాలని డిజైన్ చేశారు. ఫైల్ ఫౌండేషన్ పనులు చేపట్టినప్పుడే చుట్టుపక్కల ఉన్న ఇతర ఆలయాలతో పాటు పెద్ద పెద్ద భవనాలకు డ్యామేజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని గుర్తించారు. దీంతో పనులను నిలిపివేసి మరోసారి స్ట్రక్చర్ ఇంజినీంగ్ నిపుణులు ఆలయాన్ని పరిశీలించి మరో నమూనాను తయారు చేసి డీపీఆర్ ఇవ్వాలని హైదరాబాద్‌లోని ఓ కన్సల్టెన్సీని ఆదేశించారు. వారు ఆలయాన్ని ఆరు బ్లాకులుగా విభజించి 314 పిల్లర్లతో నిర్మించేందుకు మరో బ్లూ ప్రింట్‌తో కూడిన డీపీఆర్‌ను సీఎం సమక్షంలో అధికారులకు ప్రజెంట్ చేశారు. దీంతో ప్రభుత్వం రెండవ నమూనాకు ఫైనల్ చేసి నిర్మాణం చేసేందుకు సంవత్సర కాలంలో పూర్తి చేయాలని ఆదేశించింది.
ప్రధాన ఆలయంలో మహా మంటప నిర్మాణానికి 94 పిల్లర్లు, ఈస్ట్ గోపురానికి 52 పిల్లర్లు, బ్రాహ్మణ సత్రానికి 44 పిల్లర్లు, కోటి లింగాలకు 36 పిల్లర్లు, నిత్య కల్యాణ మంటపానికి 56 పిల్లర్లు, అద్దాల మంటపానికి 32 పిల్లర్లతో నిర్మాణం చేపట్టేలా పనులు ప్రారంభించారు. ఆలయం ఇప్పటికే చెరువు పరిసర ప్రాంతాల్లో నిర్మిస్తుండడంతో ర్యాఫ్ట్ ఫౌండేషన్‌తో చేపట్టారు. ర్యాప్ట్ ఫౌండేషన్‌లో చెరువు మట్టిని పూర్తి స్థాయిలో కింది నుంచి తీసివేసి మొదట ఉడెన్ ఫైల్స్ తరువాత మంచి మొరం పోసి దానిపై సిమెంట్ కాంక్రీట్‌తో పైభాగానికి తీసుకువచ్చిన అనంతరం స్టీల్ మ్యాట్ కట్టి ఆలయాన్ని నిర్మించనున్నారు. బాసర ఆలయాన్ని శిలలతో నిర్మించేందుకు ముందుకు వస్తున్న ప్రభుత్వం రాజన్న ఆలయాన్ని అదే విధంగా నిర్మించాలంటున్నారు. చారిత్రక దర్పం ఉట్టిపడేవిధంగా, రాబోయే తరాలకు మరింత ఆకర్షణీయంగా కనిపిచేందుకు శిలలైతేనే బాగుంటుందని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు.


