అగ్రకులాల ఆధిపత్యాన్ని కూల్చేస్తాం..
ఆరోపణలకు అభివృద్ధితోనే బదులిస్తా
● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
రాయికల్: ఎమ్మెల్యేగా తనపై వస్తున్న ఆరోపణలకు అభివృద్ధితోనే బదులిస్తానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. పట్టణంలో గురువారం కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాయికల్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని, గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న రూ.3 కోట్ల బిల్లులను సీఎం సహకారంతో చెల్లించామని, తాజాగా రూ.4 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు. మున్సిపల్ పార్క్, డివైడర్లు, సీసీరోడ్లు, డ్రైనేజీలు, స్మార్ట్‌వాటర్ వంటి అభివృద్ధి పనులకు రూ.7.20 కోట్లు కేటాయించామని, వాటికి ఈనెల 24న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ భూమిపూజ చేయనున్నారని వివరించారు. కార్యక్రమాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట నాయకులు మోర హన్మండ్లు, గండ్ర రమాదేవి, ఏనుగు మల్లారెడ్డి, కోల శ్రీనివాస్, రవీందర్‌రావు, గన్నె రాజిరెడ్డి, రాంమూర్తి, మ్యాకల కాంతారావు ఉన్నారు.
గొల్లపల్లి: అగ్రకులాల రాజ్యాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ బలగంతో కూల్చేస్తామని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహారాజ్ అన్నారు. లక్ష కిలోమీటర్ల రథయాత్రలో భాగంగా గురువారం రాత్రి మండలకేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. వందకు 90 శాతం అణ గారిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాన్ని అప్పజెప్పేవరకూ పోరాటం చేస్తామన్నారు. 90శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలను పది శాతం కూడా లేని అగ్రకులాలు బానిసలుగా మార్చుకుని రాజ్యమేలుతున్నారని పేర్కొన్నారు. పీడిత జాతుల విముక్తి కోసం నాయకత్వం వహించాలని, రాజ్యాంగ ఆయుధాల తో యుద్ధం చేస్తే బానిసల భూకంపం వస్తుందని, అప్పుడే సింహాసనం చేజిక్కుతుందని పేర్కొన్నారు. గొల్లపల్లిలో రెడ్డి, వెల్మల ఆధిపత్యాన్ని నశింపజేసేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు.
పట్టాలు ఇవ్వకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తాం
నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేసి న్యాయం చేయకపోతే బాధితులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని విశారదన్ మహారాజ్ అన్నారు. మండలకేంద్రంలోని నల్లగుట్ట వడ్డెరకాలనీని సందర్శించారు. కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 25ఏళ్లుగా 20 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నా నేటికీ ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయకపోవడం శోచనీయమన్నారు. అధికారులు వెంటనే స్పందించి పేదలకు తగిన న్యాయం చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్ప ష్టం చేశారు. జేఏసీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా ఇన్‌చార్జి శివ, అధ్యక్షుడు మనాల కిషన్, నాయకులు శ్రీనివాస్ చారి, అశోక్, తిరుపతి, లక్ష్మణ్, జాని, మధుసూదన్ పాల్గొన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ విశారన్ మహారాజ్
అగ్రకులాల ఆధిపత్యాన్ని కూల్చేస్తాం..


