టికెట్లు ఎవరి ‘చేతి’కో..!
● పలు వార్డుల్లో తీవ్ర పోటీ
● తలనొప్పిగా ఎంపిక వ్యవహారం
● 12వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షేక్ ముఖీమ్‌ను ఇప్పటికే ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు ప్రకటించారు. ఆ వార్డు నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షాకీర్ రెండుసార్లు, ఒకసారి అతని సతీమణి కౌన్సిలర్లుగా గెలుపొందారు. ఈ వార్డుకు సంబంధించి పార్టీలో తమకు ఎదురులేదని, నాలుగోసారి కూడా టికెట్ తమకే వస్తుందని ధీమాతో ఉన్న షాకీర్‌కు జువ్వాడి షాక్ ఇచ్చారు. అతనిపై ఆగ్రహంతో ఉన్న ఆయన సర్వేతో సంబంధం లేకుండా నేరుగా ముఖీమ్ పేరు ప్రకటించారు. మరోవైపు షాకీర్.. పార్టీ పెద్దల వద్ద ఉన్న పలుకుబడితో టికెట్ తమకే వస్తుందని వార్డులో ప్రచారం చేస్తున్నాడు. అయితే ఈ వార్డు ఈ సారి కూడా మహిళకే రిజర్వ్ కావడంతో టికెట్ ముఖీమ్ కుటుంబానికా..? లేక షాకీర్ కుటుంబానికి దక్కుతుందా..? అన్నది ఆసక్తిగా మారింది.
మెట్‌పల్లి: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రేపోమాపో విడుదలయ్యే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థల ఎంపికలో నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ మేరకు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడానికి కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో వార్డుల్లో పార్టీ టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. టికెట్ రాని పక్షంలో స్వతంత్రులు గానైనా పోటీ చేయాలనే ఆలోచనలో నాయకులు ఉండడం ఆ పార్టీకి తలనొప్పిగా మారే అవకాశముంది.
● 11 వార్డు నుంచి మాజీ సర్పంచ్ కొమొరెడ్డి లింగారెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ కొమొరెడ్డి తిరుపతిరెడ్డి, కొమొరెడ్డి శేషులు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. ఈ ముగ్గురు బంధువులు కావడం విశేషం. టికెట్ కోసం ఎవరి దారిలో వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
● 15వార్డు నుంచి బీఆర్‌ఎస్ తరఫున కౌన్సిలర్‌గా గెలిచిన పిప్పెర లత ఆమె భర్త రాజేశ్ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఎన్నికల్లో హస్తం టికెట్ తమకే ఖాయమని ధీమాలో ఉన్న వారికి పద్మశాలీ సేవా సంఘం పట్టణ అధ్యక్షుడు ధ్యావనపల్లి రాజారాం ఇటీవల కాంగ్రెస్‌లో చేరడంతో పోటీ ఏర్పడింది. టికెట్ హామీతోనే రాజారాం హస్తం గూటికి చేరారనే ప్రచారం జరుగుతోంది.
● 22వ వార్డు నుంచి పోటీ చేయాలనుకున్న కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జెట్టి లింగంకు అక్కడ రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో 21వార్డు నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. ఈ వార్డులో అప్పటికే యూత్ కాంగ్రెస్ నాయకుడు ఖాజా అజీం బరిలో ఉంటానని ప్రచారం చేస్తున్నాడు. గత ఎన్నికల్లో ఇదే వార్డు నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం లింగం రావడంతో టికెట్‌పై ఆయనకు టెన్షన్ పట్టుకుంది.
● 25వార్డు నుంచి బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన మర్రి సహాదేవ్ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. ప్రస్తుత ఎన్నికల్లో అతని సతీమణి, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఉమారాణిని పోటీలో నిలుపుతున్నాడు. మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న పార్టీ పట్టణ కార్యదర్శి తుమ్మనపల్లి రాంప్రసాద్ టికెట్ తమకే ఇవ్వాలని పట్టుబట్టుతున్నాడు.
అక్కడ ముఖీమ్ కుటుంబానికా..? షాకీర్‌కా కుటుంబానికా..?
టికెట్లు ఎవరి ‘చేతి’కో..!


