కబ్జాపై మాట్లాడితే టార్గెట్ చేశారు
జగిత్యాలటౌన్: మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు పెట్రోల్‌బంకునకు సంబందించి భూకబ్జా విషయంలో మాట్లాడితే తనను టార్గెట్ చేశారని, అదే తన రాజీనామాకు ప్రధాన కారణమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి అన్నారు. జగిత్యాల నడిబొడ్డున రూ.100కోట్ల మున్సిపల్ భూమి కబ్జా ఆరోపణలపై శుక్రవారం విలేకరుల సమావేశంలో స్పందించారు. యావర్‌రోడ్డు విస్తరణకు తొలి ప్రయత్నంగా మాస్టర్‌ప్లాన్ ప్రకారం డివైడర్ నిర్మిస్తే పెట్రోల్‌బంకు విషయం బయటకు వస్తుందని తనపై ఒత్తిడి తెచ్చారని వివరించారు. మొదలుపెట్టిన డివైడర్ నిర్మాణాన్ని మార్చి కట్టేలా చేశారన్నారు. కబ్జాదారులను కాపాడేందుకు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తనను నడిరోడ్డుపై నిలబెట్టి ‘ఇది మా వ్యక్తిగత విషయం నీవు తలదూర్చవద్దు’ అంటూ ఒత్తిడి చేశారని వెల్లడించారు. నిజాలు తెలిసి కూడా ఎమ్మెల్యే తెరవెనుక రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. 1952లో అమలులో లేని కిబాల ద్వారా స్థలం కొనుగోలు చేయడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు. అనుమానాస్పదంగా ఉన్న కిబాల పత్రాన్ని అందరి సమక్షంలో ట్రాన్స్‌లేట్ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ భూముల పరిరక్షణకు పార్టీలకతీతంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సహకారం ఉంటుందన్నారు. నాయకులు మ్యాదరి అశోక్, గంగాధర్, తిరుపతి, గంగారాం, దివాకర్, రమేశ్, కళావతి, లక్ష్మి, మధురిమ, రాజన్న, కవిత తదితరులున్నారు.


