దశ మారనున్న ధర్మపురి
ధర్మపురి: ధర్మపురి దశ మారనుంది. పట్టణ అభివృద్ధికి రూ.50 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం ముందుకొస్తుంది. సకాలంలో నిధులు మంజూరైతే వివిధ రకాల పనులు చేపట్టనున్నారు. పుణ్యక్షేత్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్ కృషి చేయడానికి సంకల్పించారు. ఇటీవల రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయశాఖ ముఖ్య అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆలయ అభివృద్ధితో పాటు రానున్న గోదావరి పుష్కరాల విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలు, ధర్మపురి ఆలయం, పట్టణంలో చేపట్టే వివిధ అభివృద్ధి పనులపై చర్చించారు. పట్టణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
రూ.50 కోట్లతో చేపట్టే పనులు
శ్రీలక్ష్మీనృసింహస్వామి ప్రధానాలయం పునర్నిర్మాణం, క్యూ కాంప్లెక్స్, వైకుంఠ ద్వార నిర్మాణం, వ్రత మండపం, కాలక్షేప మండపం, ప్రత్యేక ప్రసాదాల కౌంటర్లు, స్వామివారల నిత్య కల్యాణ మండపం, రథశాల, మహా ప్రాకార నిర్మాణం తదితర పనులు చేపట్టనున్నారు. అలాగే గోదావరి తీరంలో పెద్ద డార్మిటరి హాల్ నిర్మాణం, సీ్త్రలు బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు నిర్మించనున్నారు.
ఖర్చు ఇలా..
శ్రీయోగాలక్ష్మీనృసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.2 కోట్లు, ఉగ్ర నృసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.5.50 కోట్లు, రథశాలకు రూ.3 కోట్లు, యమధర్మరాజు ఆలయ పునర్మిర్మాణానికి రూ.20 లక్షలు, బ్రాహ్మణ సంఘం పక్కన నూతన కల్యాణ మండపానికి రూ.7 కోట్లు, సత్యావతి ఆలయం రూ.30 లక్షలు, గోదావరి తీరాన డార్మీటరి గదుల నిర్మాణానికి రూ.3 కోట్లు, సులభ్‌కాంప్లెక్స్, వీఐపీల కోసం ప్రత్యేక గదులు, వరాహ తీర్థమైన చింతామణి చెరువులో వరాహమూర్తి విగ్రహం తదితర పనులు చేపడుతారు.
కుంభమేళా తరహాలో..
2027లో రానున్న గోదావరి పుష్కరాలను మహా కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ ఇటీవల సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు.
అందరి సహకారంతో అభివృద్ధి


