‘గ్యారంటీ’ ఇస్తేనే ధాన్యం కేటాయింపు
జగిత్యాలరూరల్: జిల్లాలో రైస్‌మిల్లర్లకు కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని గతంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యం కేటాయించేవారు. ప్రస్తుత ప్రభుత్వం మిల్లర్లు తీసుకునే ధాన్యానికి బ్యాంక్ గ్యారంటీ ఇస్తేనే కేటాయిస్తున్నారు. ఇలా కేటాయించిన ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలో తెలియక మిల్లర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
95 పారాబాయిల్డ్ రైస్‌మిల్లులు
జిల్లాలో మొత్తం 95 పారాబాయిల్డ్ రైస్‌మిల్లులు, 39 రా రైస్‌మిల్లులు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి సీజన్‌లో సేకరించిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు అప్పగించి వారి నుంచి బియ్యాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది. ఆరునెలలుగా బియ్యం సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో మిల్లర్ల వద్ద భారీగా ధాన్యం పేరుకుపోయింది. అలాగే బియ్యం నిల్వలు పెరిగాయి. ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించే ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయడం అనేది మిల్లర్లకు ఆందోళనకరంగా మారింది.
బ్యాంక్ గ్యారంటీతో కష్టాలు
గతంలో ప్రభుత్వం ఐకేపీ ద్వారా సేకరించిన ధాన్యాన్ని మిల్లర్ల సామర్థ్యాన్ని బట్టి కేటాయించేవారు. ప్రస్తుతం బ్యాంక్ గ్యారంటీ పెట్టడంతో చాలామంది మిల్లర్లు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 40 మంది రైస్‌మిల్లర్లకే ప్రభుత్వం ధాన్యం కేటాయించింది. మిగతా రైస్‌మిల్లర్లకు బ్యాంక్ గ్యారెంటీ ఇస్తేగానీ అధికారులు ధాన్యం కేటాయించే పరిస్థితి లేదు.


