
ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోని వారికి నోటీసులివ్వండి
ఇబ్రహీంపట్నం: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా కట్టుకోని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. ఇబ్రహీంపట్నం మండలం డబ్బా, వర్షకొండ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, అంగన్‌వాడీ భవన నిర్మాణాలను పరిశీలించారు. ఇళ్లు కట్టుకోని వారిని రద్దు చేసి అర్హులకు కేటాయించాలన్నారు. ఉపాధి హామీలో మంజూరైన అంగన్‌వాడీ భవన నిర్మాణాలు పూర్తి చేయాలని అన్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. మొక్కజొన్నల తేమశాతాన్ని తెలుసుకున్నారు. ఎన్ని క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. ఆర్డీవో శ్రీనివాస్, ఎంపీడీవో మహ్మద్ సలీం, తహసీల్దార్ వరప్రసాద్, హౌసింగ్ పీడీ ప్రసాద్, పీఆర్‌డీఈ రమణారెడ్డి, ఏఈ అభినవ్, ఏవో రాజ్‌కుమార్, ఆర్‌ఐ రేవంత్‌రెడ్డి, సింగిల్‌విండో సీఈవో మంత్రి సతీశ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శులు రవళి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.