
బతుకమ్మ ఏర్పాట్లేవి..?
జగిత్యాల: బతుకమ్మ వేడుకలు ప్రారంభమైనా జిల్లా కేంద్రంలో మాత్రం నిమజ్జనం ఏర్పాట్లు చేయలేదు. మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయాల్సి ఉండగా అధికారులు పట్టించుకోవడంలేదు. తొమ్మిది రోజులపాటు బతుకమ్మ ఆడి మహిళలు నిమజ్జనం చేస్తుంటారు. ఏర్పాట్లు లేకపోవడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. సద్దుల బతుకమ్మ వరకు పనులు పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. జిల్లాకేంద్రంలో సుమారు 18 ఘాట్ల వరకు ఉన్నాయి. రామాలయం, బసవేశ్వరస్వామి, పొన్నాల గార్డెన్, లింగంపేట చెరువు, ధర్మసముద్రం, వీక్లీబజార్ స్కూల్‌సమీపం, చిలుకవాడ, గొల్లపల్లిరోడ్, కండ్లపల్లి చెరువు, శంకులపల్లి చౌరస్తా, ముప్పారపు చెరువులో రెండు ఘాట్ల చొప్పున మొత్తం 18ఘాట్లు ఉన్నా.. ఇప్పటివరకు ఎక్కడా శుభ్రత చర్యలు చేపట్టలేదు.
రూ.20 లక్షల కేటాయింపు
బతుకమ్మ సంబరాల కోసం ఇప్పటికే రూ.20 లక్షలు కేటాయించినట్లు తెలిసింది. ఇందులో ఘాట్ల వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేయడంతోపాటు, లైటింగ్, కొన్నిచోట్ల మహిళల కోసం సౌండ్ సిస్టం ఏర్పాటు చేస్తుంటారు. అలాగే బతుకమ్మ ఆడుకునేందుకు సాండ్ (దుబ్బ) పోస్తుంటారు. వీటన్నింటి కోసం రూ.20 లక్షలు టెండర్ వేశారు. కానీ వేడుకలు ప్రారంభం కాకముందే చేస్తే బాగుండేదని మహిళలు పేర్కొంటున్నారు.