‘స్పౌజ్‌’ దుర్వినియోగంపై విద్యాశాఖ ఫైర్‌! | - | Sakshi
Sakshi News home page

‘స్పౌజ్‌’ దుర్వినియోగంపై విద్యాశాఖ ఫైర్‌!

Sep 23 2023 2:00 AM | Updated on Sep 23 2023 5:33 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే గవర్నమెంట్‌ హెడ్‌మాస్టర్‌(జీహెచ్‌ఎం) బదిలీల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులపై విద్యాశాఖ స్పందించింది. దంపతులిద్దరూ ప్రభుత్వ టీచర్లు అయి బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో భార్యాభర్తలు ఒకే దగ్గర పనిచేసేందుకు వారికి ప్రత్యేకంగా 10 పాయింట్లు కేటాయించింది. ఈ పాయింట్లు ప్రత్యేకంగా వినియోగించుకుని స్పౌజ్‌ టీచర్లంతా ఒకే చోట పనిచేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ... ప్రభుత్వ ఉద్దేశానికి తూట్లు పొడుస్తూ చాలా మంది జీహెచ్‌ఎంలు వారి భార్య/భర్త వద్దకు కాకుండా తమకు నచ్చిన చోటుకు బదిలీ కోసం ఈ పాయింట్లను వాడుతున్నారు. ఈ విషయాన్ని ఈనెల 20వ తేదీన ‘సార్లూ.. ఇది తగునా’ శీర్షికన పలువురు జీహెచ్‌ఎంలు నిబంధనలకు విరుద్ధంగా చేసుకున్న దరఖాస్తుల తీరును ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై నాన్‌స్పౌజ్‌ టీచర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు సాక్షి కథనం రేపిన దుమారంపై జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లోని జిల్లా విద్యాశాఖ అధికారులు(డీఈవోలు) అప్రమత్తమయ్యారు. జీహెచ్‌ఎంలు నిబంధనలకు విరుద్ధంగా చేసుకున్న ఆప్షన్లను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన దృష్టికి తీసుకెళ్లారు.

చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

కేంద్ర, రాష్ట్ర, లోకల్‌బాడీల్లోని భార్యభర్తలైన టీచర్లు ఒకే చోట పనిచేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పది పాయింట్ల విధానాన్ని తీసుకొచ్చింది. అయితే పలు చోట్ల అక్రమాలు జరుగుతున్నాయన్న ‘సాక్షి’ కథనంపై స్పందించిన దేవసేన రాష్ట్రంలోని అన్ని డీఈవో కార్యాలయాలను అప్రమత్తం చేశారు. ఇప్పటి వరకు చేసుకున్న జీహెచ్‌ఎం దరఖాస్తుల్లోని ఆప్షన్లను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. వారిలో భార్య లేదా భర్త పనిచేస్తున్న చోటుకు కాకుండా దూరంగా దరఖాస్తు చేసుకున్నా.. పాయింట్లను దుర్వినియోగం చేసిన వారిని గుర్తించి వెంటనే వారికి కేటాయించిన 10 పాయింట్లు రద్దు చేయాలని, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు.

ఎందుకు దుర్వినియోగం?

కేవలం జిల్లా కేంద్రాల్లో నివసించాలని, తమ పిల్లలకు మంచి విద్య, వైద్యం అందాలన్న ఆలోచనలతో చాలా మంది స్పౌజ్‌ టీచర్లు భార్య/భర్తకు దూరంగా ఉన్న పాఠశాలను ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు.

స్పౌజ్‌ పాయింట్లు దుర్వినియోగానికి అధిక హెచ్‌ఆర్‌ఏ మరో కారణమని నాన్‌స్పౌజ్‌ టీచర్లు ఆరోపిస్తున్నారు. అర్బన్‌, సెమీఅర్బన్‌, రూరల్‌ ప్రాంతాల్లో వచ్చే హెచ్‌ఆర్‌ఏ విషయంలో వ్యత్యాసాల కారణంగా స్పౌజ్‌ టీచర్లంతా తప్పుదారి పడుతున్నారని మండిపడుతున్నారు.

కాంప్లెక్స్‌ పాఠశాలల్లో విధులు నిర్వహించాల్సి రావడం ఇబ్బందిగా భావిస్తున్నారు. కాంప్లెక్స్‌ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులకు బిల్స్‌ నిర్వహణ, వేతనాలు చెల్లింపు, సెలవుల పట్టీ, సర్వీసు పుస్తకాల రికార్డుల నిర్వహణ తదితర కారణాలతో పని ఎగ్గొట్టేందుకు వీరు కాంప్లెక్స్‌ పాఠశాలలను ఎంచుకోకుండా మరో చోటుకు వెళ్తున్నారు.

భార్య/భర్త జీహెచ్‌ఎంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసేందుకు స్పౌజ్‌లు ఇబ్బంది పడుతున్నారు. తమ భర్త/భార్య ఆదేశాలు పాటించడం ఇష్టంలేని వారు అవే పాయింట్లు వినియోగించుకుని స్పౌజ్‌కు దూరంగా వెళ్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement