
అకాల వర్షాలతో అన్నదాత విలవిల
జగిత్యాలఅగ్రికల్చర్/మెట్‌పల్లిరూరల్: జిల్లాలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాత విలవిలలాడుతున్నాడు. ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం వర్షార్పణం అవుతోంది. ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోతుండటంతో పాటు మొలకలు వస్తుండటంతో రైతులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కూలీల ఖర్చు రెట్టింపు అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి తడిసిన ధాన్యం ఆరబెట్టి కొనుగోళ్లు పూర్తయ్యే నాటికి ఎన్ని రోజులు అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఓ వైపు రైతులు ఆందోళనలు చేస్తుండగా కలెక్టర్ సత్యప్రసాద్ నేతృత్వంలో జిల్లా అధికారులు, మరోవైపు ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాల బాట పట్టి రైతులకు ధైర్యం చెబుతున్నారు.
వర్షపు నీరు తొలగించేందుకు కష్టాలు
కొనుగోలు కేంద్రాల్లో సరిపోయేంత స్థలం లేకపోవడం, ఓ కుప్ప పక్కనే మరో ధాన్యం కుప్ప పోయడంతో వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. వర్షపు నీరు ఎటుపోయే పరిస్థితి లేకపోవడంతో రైతులు తట్టలు, బకెట్లతో బయటకు ఎత్తిపోసే పరిస్థితి నెలకొంది. ధాన్యం కుప్పల మధ్య నుంచి చిన్నపాటి కాలువలు ఏర్పాటు చేసుకొని నీటిని తరలించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ధాన్యాన్ని ఆరబెట్టేందుకు తిప్పలు
వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా తిప్పలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు ఎక్కువగా ఉన్న చోట తడిసిన ధాన్యం ఆరబెట్టడం సమస్యగా మారింది. ధాన్యం కుప్పల పక్కన స్థలం లేకపోవడంతో డబ్బాలతో ఇతర చోటుకు మోసి ఆరబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని నేర్పడం ఒకరిద్దరు రైతులతో అయ్యే పని కాకపోవడంతో ఆరబెట్టేందుకు కూలీలను పెట్టుకుంటున్నారు. దీంతో రైతులకు రెట్టింపు ఖర్చులు అవుతున్నాయి.
నిలిచిన ధాన్యం కొనుగోళ్లు
జిల్లాలో అకాల వర్షాలతో ధాన్యం కొనుగోళ్లు నిలి చిపోయాయి. ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్న సమయంలో వర్షాలతో కొనుగోలు కేంద్రాలు గందరగోళంగా మారాయి. కవర్లు కప్పినప్పటికీ ధాన్యం అక్కడక్కడ తడవడంతో తేమ సాకుతో మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు తంటాలు
తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఆందోళనలు
రైతులకు రెట్టింపు కానున్న ఖర్చు
ఆరబెట్టడం ఇబ్బందిగా మారింది
వర్షాలతో కవర్లు కప్పినప్పటికీ తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడం ఇబ్బందిగా మారింది. కుప్పల పక్కన కుప్పలు ఉండటంతో ఆరబెట్టేందుకు స్థలం లేదు. ఎక్కడికక్కడే నిలిచిన వర్షపు నీటిని తొలగించడం కష్టమవుతోంది.
– సాయిరెడ్డి, సింగరావుపేట
తూకం వేస్తే ఇబ్బందులుండేవి కావు
కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తూకం వేసి రవా ణా చేస్తే ఇబ్బందులు ఉండేవి కావు. ఇప్పుడు తడిసిన ధాన్యం ఆరబెట్టడం సమస్యగా మారింది. ఆరబెట్టకపోతే గింజలు నల్లబడుతాయి. – అత్తినేని లచ్చవ్వ, తిప్పన్నపేట
ఫొటోలో తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతు భూమేశ్. బండలింగాపూర్‌కు చెందిన ఈ రైతు నెల రోజుల క్రితం గ్రామంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి 30 క్వింటాళ్ల ధాన్యాన్ని తీసుకెళ్లాడు. పదిరోజుల్లోపే తేమశాతం వచ్చినా ధాన్యం కొనుగోలు చేయలేదు. దీంతో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి తడిసింది. ఆరబెట్టేందుకు తంటాలు పడుతున్నాడు.

అకాల వర్షాలతో అన్నదాత విలవిల

అకాల వర్షాలతో అన్నదాత విలవిల

అకాల వర్షాలతో అన్నదాత విలవిల