ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్‌ | - | Sakshi
Sakshi News home page

ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్‌

Aug 31 2023 12:06 AM | Updated on Aug 31 2023 7:35 AM

- - Sakshi

ఆధునికయుగంలో అనుబంధాలు ఇంకా తరిగిపోలేదు. ఉమ్మడి కుటుంబాలు తగ్గినా పేగుబంధాలు ధృడంగానే ఉన్నాయి.

విద్యానగర్‌/కరీంనగర్‌ కల్చరల్‌: ఆధునికయుగంలో అనుబంధాలు ఇంకా తరిగిపోలేదు. ఉమ్మడి కుటుంబాలు తగ్గినా పేగుబంధాలు ధృడంగానే ఉన్నాయి. ఎక్కడ ఉన్నా పరస్పర యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆత్మీయత పంచుతూ తోబుట్టువుల బంధాన్ని శాశ్వతంగా నిలిపేది రక్షాబంధన్‌. సోదరీసోదరుల ఆత్మీయ బంధానికి ప్రతీక అయినా రక్షా బంధన్‌ను గురువారం దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. పండుగ రోజున పుట్టిళ్లు సందడిగా మారుతాయి. అక్కాచెల్లెళ్లు కట్టిన రాఖీలతో సోదరుల ముంజేతులన్నీ వివిధ రంగులు, డిజైన్ల రాఖీలతో కళకళలాడుతాయి. అండగా ఉంటామని హామీ ఇస్తూ అన్నదమ్ములు తమకు తోచిన కట్నకానుకలు సోదరీమణులకు ఇస్తారు. రక్షాబంధన్‌ను రాఖీపౌర్ణమి, జంద్యాల పౌర్ణమిగా పిలుస్తారు.

పండుగ ఎలా ప్రారంభమైందంటే..
పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య పుష్కరకాలం జరిగిన యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రడు పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపా యం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడు సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్గిస్తుంది. సరిగా ఆ రోజు ఽశ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతిపరమేశ్వరులు, లక్ష్మీనారాయణను పూ జించి రక్షాను దేవేంద్రుని చేతికి కడుతుంది.

దేవతలందురూ పూజించిన రక్షాలను ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. అలా రాఖీ పండుగా మొదలైందని పురాణాలు చెబుతున్నాయి. అన్నాతమ్ముళ్లకు కట్టే రక్షాబంధన్‌ ద్వారా వారు తలపెట్టే కార్యాలు విజయవంతం కావాలని, సుఖసంతోషాలు, సిరి సంపదలు కలగాలని ఆకాంక్షించే విశిష్టత రాఖీ పండుగకు ఉంది. నూతన వస్రాలు, బహుమతులతో ఆనందంగా గడుపుతారు. బ్రిటీష్‌వారు దేశాన్ని పాలిస్తున్న కాలంలో వారి ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. సీ్త్రలు రక్షణ కోసం వీరయెధులకు రక్షాబంధన్‌ కట్టేవారు. సోదరభావంతో యోధులు మహిళలకు రక్షణ కల్పించేవారు. రాణి కర్ణావతి దుర్గాన్ని శత్రువులు ముట్టడించినప్పుడు ఢిల్లీ బాదుషాకు రాఖీ పంపంది. బాదుషా ఆమెను సోదరిగా భావించి శత్రువులను తరిమికొట్టి ఆమె ఇంట్లో భోజనం చేసి కానుకల సమర్పించినట్టు చరిత్ర.

ఆన్‌లైన్‌ రక్షాబంధన్‌
కాలం మారడంతో పాటు రక్షబంధన్‌ తీరు మారింది. విద్య, ఉపాధి, ఇతరత్రా కారణాలతో దూర ప్రాంతాల్లో ఉంటున్న సోదురులకు పోస్టు ద్వారా రాఖీలను పంపితే కట్టకొని తోబుట్టువులకు కానుకలు పంపుతుండే సంప్రదాయం నేటికి కొనసాగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతం కావడంతో ఆన్‌లైన్‌ ద్వారా రాఖీలను పంపి ఆన్‌లైన్‌ ద్వారానే కానుకులు స్వీకరిస్తున్నారు. సామాజికి మాధ్యమాల ద్వారా పరస్పరం అభినందనలు తెలుపుకునే వెసులుబాటు ఉంది. పద్ధతులు మారినా రాఖీ అనుబంధం, ఆప్యాయత మాత్రం చెక్కుచెదరలేదు.

ఈ సమయాలు అనుకూలం
గురువారమే రాఖీ పౌర్ణమి జరుపుకోవాలి. శుభకార్యాలు, పండుగలకు సూర్యోదయ తిథి ప్రమాణంగా పాటించాలి. ఉదయం 6.30 నుంచి 9.45, మళ్లీ 10.50 నుంచి 11.50 నిమిషాల మధ్య, మధ్యాహ్నం 12.30 నుంచి 2.45 వరకు, సాయంత్రం 3.45 నుంచి 6.00 గంటల మధ్య రాఖీలు కడితే శుభకరం.

– శ్రీతాటిచెర్ల హరికిషన్‌శర్మ, పురోహితుడు

ముగ్గురు అన్నదమ్ములు
నాకు ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అన్నలు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. తమ్ముడు మాత్రం కరీంనగర్‌లో మాతోనే ఉంటాడు, రైస్‌మిల్లు ఉంది. ప్రతి పండుగకు ఇద్దరు అన్నలు కళ్లముందు లేకున్న రాఖీ పంపిస్తాను. ఇక్కడ ఉండే కృష్ణకు మాత్రం స్వయంగా రాఖీ కడతాను.

– సింగిరికొండ మాధవి, తిరుమలనగర్‌, కరీంనగర్‌

తమ్ముడంటే ప్రాణం
మా ఇంట్లో మేము ముగ్గురం, మాకు తమ్ముడు అన్వేశ్‌ అంటే ప్రాణం, ప్రస్తుతం వాడు హుస్నాబాద్‌లోని శ్రీనివాస హాస్పిటల్‌ ఇన్‌చార్జి. రాఖీపండుగ రోజు ఎంత బిజీగా ఉన్నా వాడి దగ్గరికి వెళ్లి మేమిందరం కలిసి రాఖీ కడతాం. తమ్ముడు కూడా మా కోసం ప్రతీ పండుగకు ఎదురుచూస్తుంటాడు, వాడి ప్రేమాభిమానాలు ఎప్పటికీ కావాలి. వాడు ఆనందంగా ఉండాలని, ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటాం.
– స్రవంతి, అమూల్య, కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement