‘సాండ్’ బేజార్
● ప్రభుత్వ ఇసుకకు ధర ఎక్కువ
● అక్రమంగా వచ్చే ఇసుక ధర తక్కువ
● సాండ్ బజార్ ఆదాయం అంతంతే
జగిత్యాల: జిల్లాలో ఇసుక అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వరస్వామి ఆలయ ఎండోమెంట్ స్థలంలో సాండ్ బజార్ ఏర్పాటు చేశారు. ఇందులో టన్ను ఇసుక ధర సాధారణ వినియోగదారులకు రూ.1,400, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు రూ.1,200 నిర్ణయించారు. కాగా, బయట ఇసుక ఇంతకన్నా తక్కువ ధరకు దొరకడంతో సాండ్ బజార్ ఆదాయం అంతంతమాత్రంగానే ఉంది.
ఏడాదికి రూ.3 లక్షల లీజు..
మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాజరాజేశ్వర ఎండోమెంట్ స్థలాన్ని ఏడాదికి రూ.3 లక్షలకు లీజుకు తీసుకుని రూ.15 లక్షల విలువ గల వేయింగ్ మిషన్ ఏర్పాటు చేశారు. మరో రూ.20 లక్షలతో మౌలిక వసతులు కల్పించి సిబ్బందిని కూడా నియమించారు. సెప్టెంబర్ 9న సాండ్ బజార్‌ను ప్రారంభించగా, ఇప్పటి వరకు రూ.8 లక్షల రెవెన్యూ మాత్రమే వచ్చింది. సాండ్‌బజార్‌లో టన్ను ఇసుక ధర తగ్గిస్తేనే ఇక్కడ ఇసుక విక్రయాలు జరిగే అవకాశం ఉంది.
ఆగని ఇసుక అక్రమ రవాణా
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా వారి కళ్లుగప్పి ఇసుక మాఫియా పెద్ద ఎత్తున రవాణా చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని ధర్మపురి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి ఎక్కువగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఇటీవల కోరుట్లలో ఇసుక మాఫియా రెవెన్యూ అధికారులపై దాడిచేసిన ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ ఇసుక లోడ్ తక్కువ ధరకు వస్తుండడంతో ఎక్కువగా వీరి వద్దే కొనుగోలు చేస్తున్నారు. రాత్రిపూట లేదా వేకువజామునే ఎక్కువగా అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా మినరల్ డెవలప్‌మెంట్ చైర్మన్ అనిల్‌కుమార్‌కు ఇసుక ధర తగ్గించాలని ఇటీవల మాజీమంత్రి జీవన్‌రెడ్డి లేఖ సైతం రాశారు. సాండ్ బజార్ నిర్వహణ సమస్యాత్మకంగా మారుతుందని, కొనసాగింపు కష్టతరంగా ఉంటుందని, వినియోగదారులకు ప్రస్తుతం నిర్ణయించిన టన్ను ధర రూ.1,400 నుంచి రూ.1,200 తగ్గించాలని, అలాగే ఇందిరమ్మ వినియోగదారులకు రూ.వెయ్యికి అందించాలని లేఖలో కోరారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సాండ్ బజార్‌లో ఇసుక రేట్లు తగ్గిస్తే సామాన్య ప్రజలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇసుక అక్రమ రవాణా కూడా తగ్గే అవకాశాలుంటాయి.


