జాగ్రత్తలు పాటించాలి
వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజుల్లులు కురిసే అవకాశం ఉంది. చలిగాలులు కొనసాగుతాయి. మధ్యాహ్నం ఎండవేడిగా ఉంటుంది.
● వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలి
● ఆస్తమా, అలర్జి పేషెంట్లు అవసరమైతేనే బయటకు వెళ్లాలి
● వెచ్చని దుస్తులు ధరించాలి ● డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్
జగిత్యాల: చలికాలంలో జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, ఆస్తమా, అలర్జి ఉన్నవారు చలిలో బయటకు వెళ్లకూడదని పేర్కొన్నారు. బయటకు వెళ్లేటప్పుడు నిండుగా దుస్తులు ధరించి వెళ్లాలన్నారు. ఈసందర్భంగా చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’కి వెల్లడించారు.
చలికాలం ప్రారంభమైంది. ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
డీఎంహెచ్‌వో: ఈ సీజన్‌లో ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గుతుంది. చలిగాలులు శరీరంలోకి వెళ్తే వైరస్ మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆస్తమా, అలర్జి ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
వృద్ధులు, పిల్లలు, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
డీఎంహెచ్‌వో: అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. మాస్క్‌లు ధరించాలి. శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి. బయటకు వెళ్లకపోవడమే మంచిది.
అత్యవసర పనులపై వెళ్లే వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
డీఎంహెచ్‌వో: అత్యవసర పనుల కోసం మోటార్‌సైకిల్‌పై వెళ్లేవారు గ్లౌస్‌లు, మంకీక్యాప్, స్వెటర్స్ ధరించాలి. చలితీవ్రత ఎక్కువైతే చర్మంలో కణజాలాలు గడ్డకట్టి గాయాలు కావడం, వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది.
ఈ కాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి?
డీఎంహెచ్‌వో: పౌష్టికాహారం తీసుకోవడం మంచిది. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. జాగ్రత్తలు తీసుకోకుంటే చలితీవ్రతకు అవయవాల్లో గాయాలు ఏర్పడి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశముంటుంది.
గ్రామీణ ప్రాంతాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉంటే చలిమంటలు వేసుకుంటారు. వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
డీఎంహెచ్‌వో: చలితీవ్రత ఎక్కువగా ఉంటే మంటలు వేసుకునే సమయంలో వాటికి దూరంగా ఉండాలి. ఎక్కువ సమయం మంట కాగడం మంచిది కాదు. గది వాతావరణం వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. రూమ్ హీటర్స్ వాడుకోవచ్చు.
శీతాకాలంలో ముక్కుదిబ్బడ, ఆయాసం సమస్యలు ఉంటాయి. వీటి నియంత్రణకు చర్యలు?
డీఎంహెచ్‌వో: ముక్కుదిబ్బడ వేసినప్పుడు నాసల్ డ్రాప్స్ వేసుకోవాలి. ఆయాసం, దమ్ము ఉన్న వారు గోరువెచ్చని నీరు తాగాలి. దీని ద్వారా ఇన్ఫెక్షన్‌లు దూరంగా ఉంటాయి.
చన్నీటి స్నానంతో ఇబ్బందులుంటాయా?
డీఎంహెచ్‌వో: వింటర్‌లో చర్మం పొడిబారడం, పెదాలు కూడా పగులుతాయి. కొందరు చలి తట్టుకునేందుకు చాలా వేడి నీటితో స్నానం చేస్తుంటారు. అది సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. స్కిన్ పొడిబారకుండా మాయిశ్చరైజర్స్ రాయాలి. బాలెన్స్‌డ్ డైట్ తీసుకోవాలి. పొగతాగడం మానేయాలి. ఎప్పుడూ చలిని తట్టుకునే దుస్తులు ధరించాలి.
ఈ కాలంలో చర్మవ్యాధులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
డీఎంహెచ్‌వో: చర్మం ఎక్కువగా పొడిబారి, పగుళ్లు ఏర్పడుతాయి. చలినుంచి రక్షణకు వ్యాజిలెన్, కొబ్బరినూనె వాడాలి. సరైన నియమాలు పాటిస్తే ఆరోగ్యకరంగా ఉంటాం.
ఉదయం వాకింగ్‌కు వెళ్లవచ్చా?
డీఎంహెచ్‌వో: ఉదయం వాకింగ్ చేసేవారు అన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలి. శ్వాసకోశ వ్యాధులున్న వారు ఇంట్లోనే వాకింగ్, యోగా లాంటివి చేసుకుంటే మంచిది. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
జాగ్రత్తలు పాటించాలి


