యమ ద్వితీయ వేడుకలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహాస్వామి అనుబంధ యమధర్మరాజు ఆలయంలో గురువారం యమ ద్వితీయ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేదపండితుడు బొజ్జ రమేశ్‌శర్మ మంత్రోచ్చరణలతో స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తంతో అభిషేకం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆయుష్య హోమం, హారతి, మంత్రపుష్పము తదితర పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా వేద పండితుడు బొజ్జ సంపత్‌శర్మ మాట్లాడుతూ, యమ ద్వితీయ రోజు యమధర్మరాజు యమలోక ద్వారాలను మూసి తన సోదరి అయిన యమి ఇంటికి వెళ్లి సోదరి ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని, ఈ రోజు మరణించిన వారికి యమలోక ప్రాప్తి ఉండదని భక్తుల నమ్మకమని, యమ ద్వితీయ రోజున స్వామివారిని దర్శించుకున్న వారికి గండాలు తొలగుతాయని పేర్కొన్నారు. వివిధ పాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, సీనియర్ అసిస్టెంట్ అలువాలు శ్రీనివాస్, సిబ్బంది తదితరులున్నారు.
హైకోర్టు జడ్జిని కలిసిన న్యాయవాదులు
జగిత్యాలజోన్: హైకోర్టు జడ్జి, జిల్లా ఫోర్ట్‌ఫోలియో జడ్జి రేణుక యారాను గురువారం జగిత్యాల బార్ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాదులు కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఫ్యామిలీ కోర్టు, ఎస్సీ, ఎస్టీ కోర్టు, క్యాంటిన్ ఏర్పాటు తదితర సమస్యల గురించి హైకోర్టు జడ్జికి వివరించారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు కాసుగంటి లక్ష్మణ్‌కుమార్, జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, ఉపాధ్యక్షుడు సిరిపురం మహేంద్రనాథ్, రమేశ్ పాల్గొన్నారు.
మద్యం షాపులకు 1,966 దరఖాస్తులు
జగిత్యాలక్రైం: జిల్లాలో 71 మద్యంషాపుల నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానించగా గురువారం రాత్రి వరకు 1,966 దరఖాస్తులు వచ్చాయి. మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తులు సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు ఫీజు పెంచడంతో వ్యాపారులు కొంత వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. గతంలో 2,636 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.52.72 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి 1,966 దరఖాస్తులకు రూ.58.98 కోట్ల ఆదాయం లభించింది. కాగా ఈనెల 27న జిల్లా కేంద్రంలోని విరూపాక్షి గార్డెన్స్‌లో డ్రా పద్ధతిన మద్యంషాపుల నిర్వాహకులను ఎంపిక చేయనున్నారు. అందుకోసం ఎకై ్సజ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్నవారు డ్రా కేంద్రానికి వచ్చేందుకు పాస్‌లు అందజేస్తున్నారు. పాస్‌లు ఉన్నవారినే డ్రా తీసే వద్దకు అనుమతించనున్నారు.
సీనియర్ సిటిజన్స్ హక్కుల రక్షణకు కృషి
జగిత్యాల: సీనియర్ సిటిజన్స్ హక్కుల రక్షణకు కృషి చేస్తామని సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృద్ధుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం సీనియర్ సిటిజన్స్ కమిషన్ వేయాలన్నారు. వృద్ధ తల్లిదండ్రులను నిరాదరించే ఉద్యోగుల వేతనాల నుంచి ప్రతి నెలా 10 శాతం మినహాయించేలా తల్లిదండ్రులకు చట్టం తెస్తామని సీఎం ప్రకటించడం అభినందనీయమన్నారు. గౌరిశెట్టి విశ్వనాథం, విజయ్, ప్రకాశ్, యాకూ బ్, అశోక్‌రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


