
జగిత్యాల జిల్లా: అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వృద్ధురాలికి సంతోషం కలిగించడానికి ఆమె కుటుంబ సభ్యులు వినూత్నంగా వ్యవహరించారు. వేంపేట గ్రామానికి చెందిన శ్రీరాముల నర్సమ్మ (90) వృద్ధాప్యంతో కొంతకాలంగా మంచానికే పరిమితమైంది. కుమారుడు, కోడలు, మనువళ్లు సపర్యలు చేస్తున్నారు. అడుగు కూడా వేయలేని ఆమెకు ఊరంతా చూపించాలని నిర్ణయించుకున్న కుటుంబసభ్యులు.. తోపుడు బండిపై గ్రామమంతా తిప్పారు. బంధువుల ఇళ్లకు తీసుకెళ్లారు. గ్రామంలోనే ఉంటున్న కూతురి ఇంటికి ఆమెను తీసుకెళ్లి.. అక్కడ భోజనం చేయించి తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. కుటుంబసభ్యుల ప్రేమకు ఆమె ఎంతగానో పరవశించింది.
వాగు కష్టాలు తీరేదెన్నడో..?
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి వద్ద మూడేళ్ల కింద ట భారీ వరదకు బ్రిడ్జి కూలిపోయిన విషయం తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు కొండాయి, మల్యాల, ఐలాపురం, గోవిందరాజుల కాలనీవాసులు వర్షా కాలం, మిగతా కాలాల్లో ప్రమాదకర పరిస్థితుల్లో వాగు దాటుకుంటూ అవ సరాలను తీర్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. బుధవారం కొండాయి వద్ద ఓ బాలింత తన చంటిపిల్లాన్ని ఎత్తుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టు కొని వాగు దాటింది. బ్రిడ్జి ఎప్పుడు కడతారో.. మా వాగు కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని ఆయా గ్రామాలవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.