
లండన్: అమెరికాలోని డల్లాస్ నగరంలో ఎన్నారైను హత్య చేసిన ఘటన మరువకముందే.. యూకేలో మరో దారుణం చోటు చేసుకుంది. బ్రిటన్‌కు చెందిన సిక్కు మహిళపై ఇద్దరు వ్యక్తలు అత్యాచారానికి పాల్పడ్డారు. యూకేలోని ఓల్డ్‌బరీ టౌన్‌లో మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 20 ఏళ్ల బ్రిటన్ సిక్కు మహిళపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ‘ ఇక మీ దేశానికి వెళ్లిపో’ అంటూ హెచ్చరించడం తీవ్రంగా కలకలం రేపుతోంది.
దీనిపై ఫిర్యాదు చేసిన సదరు బ్రిటన్ మహిళ.. వారు జాత్యహంకారవాదులుగా పేర్కొన్నారు. ఈ దారుణానికి పాల్పడింది కచ్చితంగా జాత్యహంకార వాదులేనని తీర్మానించుకున్న పోలీసులు.. దీనికి ప్రజల నుంచి సహకారం కావాలన్నారు. ప్రస్తుతం సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్న పోలీసులు.. ఫోరెన్సిక్ ఆధారాలు సంపాదించే పనిలో ఉన్నారు. దీనిపై దర్యాప్తు జరుగుతున్నట్లు యూకే పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు.
ఈ ఘటన పాల్పడిన ఇద్దరు అనమానితులను తెల్లవారిగా పోలీసులు గర్తించారు. అందులో ఒకరు క్లీన్‌షేవింగ్ హెడ్‌తో డార్క్ కలర్ టీషర్ట్ ధరించగా, మరొకరు గ్రే కలర్ టాప్‌ను ధరించినట్లు పోలీసుల ప్రాథమిక ఆధారాల ద్వారా తెలిసింది. ప్రధానంగా సిక్కు కమ్యూనిటీని టార్గెట్ చేసే ఈ దాడులు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. గత నెలలో కొంతమంది సిక్కు యువకుల్ని వేధింపులకు గురి చేసిన ఘటన సైతం ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పుడు ఓ సిక్కు మహిళపై అత్యాచారానికి పాల్పడటం అక్కడ ఉండే సిక్కు మతస్తుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. దీనిపై పోలీస్ పెట్రోలింగ్‌ను మరింత పెంచుతామని యూకే పోలీసులు స్థానికులకు భరోసా ఇచ్చారు.
ఈ ఘటనను బ్రిటీష్ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ తీవ్రంగా ఖండిచారు. ఇటీవల కాలంలో బహిరంగంగానే జాత్యహంకార జాడ్యం విస్తృతమైనట్లు పేర్కొన్నారు. ఇది కచ్చితంగా తీవ్రంగా పరిగణించాల్సిన అంశంగా స్పష్టం చేశారు.
అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆమె ఇక్కడికి చెందినది కాదంటూ జాత్యహంకార వాదులు చేసిన వ్యాఖ్యలను బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్‌కు చెందిన మరో ఎంపీ తప్పుబట్టారు. ఇది తీవ్రమైన హింసాత్మక చర్య అని, ఆమె ఇక్కడిది కాదు.. మీ దేశానికి వెళ్లిపో అంటూ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘మన సిక్కు సమాజానికే కాదు.. ప్రతి సమాజానికి సురక్షితంగా, గౌరవంగా జీవించే హక్కు ఉంది. ఓల్డ్‌బరీలోనైనా బ్రిటన్‌లో ఎక్కడా కూడా జాత్యహంకారానికి ,స్త్రీ ద్వేషానికి స్థానం లేదు’ అని పేర్కొన్నారు.