చైనాకు నిద్రపట్టనివ్వని తైవాన్.. అందుకే అమెరికాతో ఇలా.. | why Taiwan as the Central Flashpoint in China US Relations details | Sakshi
Sakshi News home page

చైనాకు నిద్రపట్టనివ్వని తైవాన్.. అందుకే అమెరికాతో ఇలా..

Jun 1 2026 3:34 PM | Updated on Jun 1 2026 4:22 PM

why Taiwan as the Central Flashpoint in China US Relations details

సుంకాలు కాదు, పశ్చిమాసియా యుద్ధం కాదు.. అమెరికాతో సంబంధాల్లో తైవాన్ ‘అత్యంత ముఖ్యమైన అంశం’ అని చైనా ఎందుకు చెబుతోంది? ప్రత్యేకించి అమెరికాతో సంబంధాల్లో తైవాన్‌కు చైనా ఇంత ప్రాధాన్యం ఇవ్వడానికి కారణమేంటి? తైవాన్‌పై సైనిక చర్యకు అవకాశం ఉందని సూచించేలా చేస్తున్న ఇలాంటి ప్రకటనలు ఏమి చెబుతున్నాయి?

తైవాన్‌ ప్రాదేశిక జలాల చుట్టూ చాలా కాలంగా చైనా యుద్ధ విమానాలు, నౌకలు సంచరిస్తూ కలకలం రేపుతున్నాయి. అవి తమ ఉత్తర, మధ్య, నైరుతి, తూర్పు భాగాల ఏడీఐజెడ్‌ (ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్)లోకి ప్రవేశించాయని రెండు రోజుల క్రితం కూడా తైవాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.  

బీజింగ్‌లో ఇటీవలే ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమావేశమయ్యారు. ఇందులో వాణిజ్యం, పశ్చిమాసియా యుద్ధం కంటే.. తైవాన్ అంశానికే చైనా అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ప్రకటనలో.. “అమెరికా-చైనా సంబంధాల్లో తైవాన్ అత్యంత ముఖ్యమైన అంశమని షీ జిన్‌పింగ్‌ చెప్పారు. దీనిని సరిగ్గా నిర్వహిస్తే ద్వైపాక్షిక సంబంధాలు స్థిరంగా ఉంటాయి. లేకపోతే ఇరు దేశాల మధ్య ఘర్షణలు, చివరకు సంఘర్షణలు కూడా తలెత్తవచ్చు. తైవాన్ స్వాతంత్ర్యం, జలసంధి, ఇరుప్రాంతాల శాంతి అనేవి అగ్ని, నీటిలా కలిసిరాని అంశాలు. తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడటం అమెరికా, చైనా మధ్య ఉన్న అతిపెద్ద ఉమ్మడి అంశం. తైవాన్ విషయంలో అమెరికా అత్యంత జాగ్రత్త వహించాలి” అని తెలిపింది.

తైవాన్‌పై చైనా హక్కుల వాదన
తైవాన్ అనేది ఆగ్నేయ చైనా తీరానికి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వీపం. ఇది తైవాన్ జలసంధి ద్వారా చైనా నుంచి వేరుపడింది. ఇది చైనా చివరి సామ్రాజ్య వంశం క్వింగ్ పాలనలో ఉండేది. అయితే, 1895లో జపాన్ అధీనంలోకి వెళ్లింది. రెండో ప్రపంచ యుద్ధంలో (1939-45) జపాన్ ఓటమి తర్వాత రిపబ్లిక్ ఆఫ్ చైనా (ఆర్‌వోసీ) తైవాన్‌పై నియంత్రణ సాధించింది.

ఆ సమయంలో జాతీయవాద పార్టీ నాయకుడు చియాంగ్ కై-షెక్ దేశానికి నాయకత్వం వహించారు. అయితే మావో జెడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టులు ఆయన పాలనను సవాలు చేశారు.

రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ప్రారంభమైన అంతర్యుద్ధం, జపాన్‌పై పోరాటం కారణంగా తాత్కాలికంగా ఆగింది. అనంతరం కమ్యూనిస్టులు విజయం సాధించి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పీఆర్‌సీ)ను స్థాపించారు.

చియాంగ్, ఆయన మద్దతుదారులు తైవాన్‌కు వెళ్లి ఆర్‌వోసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పీఆర్‌సీ, ఆర్‌వోసీ రెండూ భూభాగం, ద్వీపం కలిసిన ఏకైక చైనా తమదేనని ప్రకటించాయి. అయితే దానిపై తమ నియంత్రణ ఉండాలని కోరుకున్నాయి.

సోవియట్ యూనియన్ పీఆర్‌సీకి మద్దతు 
సోవియట్ యూనియన్ పీఆర్‌సీకి మద్దతు ఇచ్చింది. అమెరికా ఆర్‌వోసీకి మద్దతు ఇచ్చింది. ముఖ్యంగా ఆసియాలో కమ్యూనిజం వ్యాప్తిపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. కాలక్రమేణా పరిస్థితి పూర్తిగా మారింది. 1960 దశకం ప్రారంభంలో సోవియట్ యూనియన్, చైనా మధ్య విభేదాలు వచ్చిన తర్వాత సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా చైనా మిత్రదేశంగా ఉపయోగపడుతుందని అమెరికా భావించింది.

మరోవైపు, 1969లో అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి రెండు రోజుల్లోనే అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఒక నోట్‌లో ఇలా రాశారు. “800 మిలియన్ల మంది చైనా కమ్యూనిస్టులు ఒంటరిగా జీవించాలని మేము కోరుకోవడం లేదు. మాకు వారితో సత్సంబంధాలు కావాలి. అంతర్జాతీయ సమాజంలో భాగస్వామిగా, పసిఫిక్ సమాజంలో సభ్యదేశంగా చైనా ఉండాలని కోరుకుంటున్నాం” అన్నారు.

మాజీ విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిసింజర్ రహస్య సమావేశాలు నిర్వహించడం, పాకిస్థాన్, రొమేనియా ప్రభుత్వాల సహకారం లభించడం వల్ల 1979లో అమెరికా, చైనా దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాయి. చైనాకు కొత్త నాయకుడు డెంగ్ షియావోపింగ్ ఆధ్వర్యంలో ఆర్థిక వ్యవస్థను ఆధునికీకరించడం, స్వేచ్ఛాయుత విధానాలు అమలు చేయాలని నిర్ణయించుకుంది. అందులో అమెరికా సహకారం కీలకమైంది.

అతిపెద్ద సవాలు తైవానే.. 
అయితే తైవాన్ మొదటి నుంచే ప్రధాన వివాదాస్పద అంశంగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఓ సారి స్పందిస్తూ.. “మొత్తం చర్చల కాలంలో మాకు ఎదురైన అతిపెద్ద సవాలు తైవానే. చైనాకు తైవాన్ అంశం అంతర్గత వ్యవహారమని మేము గుర్తించాము. అయినప్పటికీ అమెరికా ప్రజలకు తైవాన్ ప్రజలతో సుదీర్ఘ, సన్నిహిత, స్నేహపూర్వక అనుబంధం ఉంది. అది ప్రభుత్వేతర మార్గాల ద్వారా కొనసాగడం ముఖ్యం” అన్నారు. 1979లో ప్రచురితమైన ది వైట్ హౌస్ ఇయర్స్  గ్రంథంలో కిసింజర్ ఇలా రాశారు. “మేము ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. తైవాన్‌లోని 17 మిలియన్ల మంది ముఖ్యమా, లేక భూభాగంలోని 800 మిలియన్ల మంది ముఖ్యమా అన్నది నిర్ణయించాల్సి వచ్చింది” అని పేర్కొన్నారు. అప్పటి నుంచి అమెరికా “వన్ చైనా” విధానాన్ని కొనసాగిస్తోంది.

వన్ చైనా విధానం
చైనా ఒక్కటే దేశమని, తైవాన్ దానిలో భాగమని గుర్తించే అమెరికా విధానం ఇది. అదే సమయంలో తైవాన్‌తో అనధికారిక సంబంధాలు కొనసాగిస్తోంది. దీనిని వ్యూహాత్మక అస్పష్టతగా పిలుస్తారు. ప్రత్యేకించి అమెరికా నుంచి తైవాన్‌కు ఆయుధాల విక్రయం చైనాకు అభ్యంతరకర అంశంగా మారింది.

బీజింగ్ ఎప్పుడూ తైవాన్‌ను స్వతంత్ర రాజకీయ వ్యవస్థగా గుర్తించలేదు. మరోవైపు, తైవాన్ తాము కమ్యూనిస్టు చైనాలో ఎప్పుడూ భాగం కాలేదని చెబుతోంది. చైనా చారిత్రక హక్కుల వాదనను సవాలు చేస్తోంది. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, చైనా-తైవాన్ మధ్య ఆర్థిక సంబంధాలు చారిత్రకంగా బలంగా ఉన్నాయి. తైవాన్‌కు చెందిన అనేక మంది చైనాలో పని చేస్తున్నారు. చైనా పెట్టుబడులు కూడా తైవాన్‌లో ఉన్నాయి. 2012 నుంచి అధికారంలో ఉన్న షీ జిన్‌పింగ్.. తైవాన్, దక్షిణ చైనా సముద్రం, హాంకాంగ్, షింజియాంగ్, టిబెట్ వంటి ప్రాంతాలపై నియంత్రణ సాధించడాన్ని “జాతీయ పునరుజ్జీవనం” లక్ష్యంలో భాగంగా చిత్రీకరించారు. జాతీయ పునరుజ్జీవనం అంటే చైనా గత వైభవాన్ని తిరిగి సాధించాలనే రాజకీయ లక్ష్యం. ఇందులో తైవాన్‌ను స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యం వల్ల చైనాకు నిద్రపట్టట్లేదు. ఎందుకంటే యుద్ధం మొదలైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. యుద్ధం చేయకుండా తైవాన్‌ను చైనా స్వాధీనం చేసుకోలేదు.

ఆధునిక చరిత్రలో పాశ్చాత్య శక్తులు, జపాన్‌ చేతిలో చైనా ఎదుర్కొన్న అవమానాలను బీజింగ్ తరచుగా ప్రస్తావిస్తోంది. సైన్యాన్ని బలోపేతం చేయడం, జాతీయ ఐక్యతను పెంపొందించడం, కమ్యూనిస్టు పార్టీ పట్ల విధేయత పెంచడం అవసరమని చెబుతోంది. మరోవైపు, 2016 నుంచి తైవాన్‌లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఎన్నికల్లో విజయాలు సాధిస్తోంది.

ప్రస్తుత అధ్యక్షుడు లై చింగ్-టే సహా ఆ పార్టీ నాయకులు, తైవాన్ ఇప్పటికే స్వతంత్రంగా పనిచేస్తోందని, ప్రజలు తమను చైనీయులుగా కాకుండా తైవానీయులుగా గుర్తించుకుంటున్నారని చెబుతున్నారు. సర్వేలు కూడా చైనాతో ఏకీకరణకు ప్రజా మద్దతు తక్కువగా ఉందని చూపించాయి. చాలా మంది ప్రస్తుత పరిస్థితి కొనసాగాలని కోరుకుంటున్నారు. 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత, దూర ప్రాంతాల్లో జరిగే యుద్ధాల్లో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకపోవచ్చనే అభిప్రాయం బలపడింది. 2027 సంవత్సరం కీలక మైలురాయిగా ప్రస్తావనకు వచ్చింది. ఎందుకంటే అది చైనా ప్రజా విమోచన సైన్యం స్థాపనకు 100 సంవత్సరాలు పూర్తయ్యే సంవత్సరం. 2021లో అమెరికా ఇండో-పసిఫిక్ కమాండ్ మాజీ అధిపతి ఫిల్ డేవిడ్‌సన్, ఈ దశాబ్దం ముగిసేలోపు దాడి జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ స్పష్టత లేదు.

చైనా, తైవాన్‌ యుద్ధం జరిగితే?
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. తైవాన్‌పై దాడి జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పశ్చిమాసియా యుద్ధం కంటే తీవ్రంగా ఉండొచ్చు. మొదటిగా, ఆగ్నేయ ఆసియాలోని మలక్కా జలసంధి చైనా, వియత్నాం వంటి ప్రధాన ఎగుమతి దేశాలను ప్రపంచంతో కలుపుతోంది. యుద్ధం విస్తరితే నౌకల రాకపోకలు ప్రభావితమవుతాయి. 

రెండో అంశం సెమీకండక్టర్ల ఉత్పత్తిలో తైవాన్ ఆధిపత్యం ఉంది. “సిలికాన్ షీల్డ్” సిద్ధాంతం ప్రకారం, ఈ విలువైన పరిశ్రమ కారణంగా పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో తైవాన్‌ను రక్షించడానికి అమెరికాకు ఇదే బలమైన కారణంగా నిలుస్తుంది. సిలికాన్ షీల్డ్ సిద్ధాంతం అంటే చిప్‌ల తయారీలో తైవాన్ ప్రాధాన్యం కారణంగా దానిపై దాడి చేయడానికి దేశాలు వెనుకాడతాయనే భావన.

Advertisement
 
Advertisement
Advertisement