Charlie Kirk: అంత పగ ఎవరికుంది? | Who Is Charlie Kirk And How Trump Reacts On Utah Valley University Incident, Watch Video For More Details | Sakshi
Sakshi News home page

Charlie Kirk: అంత పగ ఎవరికుంది?

Sep 11 2025 7:15 AM | Updated on Sep 11 2025 9:22 AM

Who is Charlie Kirk How Trump Reacts On Utah Valley University Incident

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సన్నిహితుడు, కన్‌సర్వేటివ్ రాజకీయ కార్యకర్త చార్లీ కిర్క్(32)‌ దారుణ హత్యకు గురయ్యారు. ఉటాకౌంటీలోని వర్సిటీలో ఆయన‌ ప్రసంగిస్తున్న టైంలో ఒక్కసారిగా ఆయన మీదకు తూటా దూసుకొచ్చింది. దీంతో రక్తపు మడుగులో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఈ ఘటన యావత్‌ అమెరికాను దిగ్భ్రాంతికి గురి చేసింది.

చార్లీ కిర్క్ (Charlie Kirk) ఒక ప్రముఖ అమెరికన్ కన్‌సర్వేటివ్ రాజకీయ కార్యకర్త.. రచయిత. వక్తగా కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. అలా అమెరికాలో సామూహిక కాల్పుల ఘటనల(Mass Shooting Incidents)పై ఉటాకౌంటీ వర్సిటీలో బుధవారం ఓ చర్చ కార్యక్రమం జరిగింది. ఆ టైంలో అక్కడున్న కొందరు విద్యార్థులు ఆయనను ప్రశ్నిస్తుండగా.. ఆయన సమాధానాలు ఇచ్చే సమయంలో కాల్పులు జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

చార్లీ కిర్క్ 1993 అక్టోబర్ 14న అర్లింగ్టన్ హైట్స్(ఇల్లినాయ్)లో జన్మించారు. 2012లో యువతను లక్ష్యంగా చేసుకుని టర్నింగ్‌ పాయింట్‌ యూఎస్‌ఏ Turning Point USA అనే కన్‌సర్వేటివ్ సంస్థను స్థాపించారు. తన 18 ఏళ్ల వయసులో స్థాపించిన ఈ సంస్థ విద్యార్థుల్లో ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ, ఫ్రీ మార్కెట్లు, లిమిటెడ్ గవర్నమెంట్ సిద్ధాంతాలను ప్రచారం చేస్తోంది.  చార్లీ కిర్క్ యువతలో కన్‌సర్వేటివ్ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు.  ప్రూవ్‌ మీ రాంగ్‌ Prove Me Wrong అనే డిబేట్ టేబుల్ ద్వారా కాలేజీ క్యాంపస్‌లలో ప్రత్యక్ష చర్చలు నిర్వహిస్తూ వచ్చారు. అలా ఆయన పేరు అమెరికా అంతటా మారుమోగింది. అలాగే 2019లో ప్రారంభించిన ఈ పోడ్‌కాస్ట్‌ ద్వారా ఆయన తన అభిప్రాయాలను యువతతో పంచుకుంటూ వచ్చారు.

ట్రంప్ సంతాపం
చార్లీ కిర్క్‌ మృతిపట్ల ట్రంప్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయ హింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం అని ట్రంప్ ప్రకటించారు. అలాగే, చార్లీ కిర్క్‌ను అద్భుతమైన, యువతకు ప్రేరణ ఇచ్చిన నాయకుడుగా కొనియాడారు. కిర్క్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తూ.. అమెరికా అంతటా  జెండాలను సగం ఎగరేయాలని ఆదేశించారు. చార్లీ కిర్క్‌కు  భార్య, ఇద్దరు పిల్లలు. భార్య ఎరికా కిర్క్‌ మాజీ మిస్‌ అరిజోనా యూఎస్‌ఏ.

కన్జర్వేటివ్స్ అంటే.. 
సాధారణంగా కన్జర్వేటివ్‌లు.. పాత సంప్రదాయాలను, విలువలను కాపాడాలనుకునే వ్యక్తులు. వీళ్లు మార్పులకు వ్యతిరేకం. పారంపర్యం, కుటుంబం, మతం, నైతికత వంటి విషయాలను ముఖ్యంగా భావిస్తారు. ప్రభుత్వం తక్కువగా జోక్యం చేసుకోవాలి.. వ్యక్తిగత స్వేచ్ఛ, బాధ్యత ఉండాలి..  పాత విలువలు, సాంప్రదాయాలు నిలబెట్టాలి.. వ్యాపారాలు స్వేచ్ఛగా పనిచేయాలి, వీటిల్లో ప్రభుత్వ నియంత్రణ తక్కువగా ఉండాలి.. దేశభక్తి, జాతీయ గౌరవం ముఖ్యమైనవిగా భాస్తారు. ఈ భావజాలం ట్రంప్‌కు చార్లీ కిర్క్‌కు మరింత దగ్గర చేసింది. 

అంత పగ ఎవరికి ఉంది?
చార్లీ కిర్క్‌ మరణం అమెరికాలో రాజకీయ హింసపై తీవ్ర చర్చను రేపుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై కాల్పుల తర్వాత.. ఈ తరహా దాడులు మరో మూడు, నాలుగు జరిగాయి. అయితే.. కిర్క్‌ను చంపేంత పగ, కోపం ఎవరికి ఉన్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటివరకు అధికారికంగా చార్లీ కిర్క్‌ను కాల్చిన వ్యక్తి ఎవరో నిర్ధారించబడలేదు. అలాగే కారణం ఏంటో కూడా తెలీదు. కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ, వాటిని అధికారాలు ధృవీకరించలేదు. ఎఫ్‌బీఐ FBI డైరెక్టర్ కాష్ పటేల్ ప్రకారం, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు, కానీ ఆ వ్యక్తి పేరు, వివరాలు వెల్లడించలేదు. అదే సమయంలో.. ఉటాకౌంటీ వర్సిటీ వద్ద ఒక వృద్ధ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతానికి కేసు ఇంకా విచారణలో ఉంది.

ఇదీ చదవండి: ఆయనతో జాగ్రత్త.. ట్రంప్‌ మనవరాలికి నెటిజన్ల సూచన

భారత్‌పై విద్వేష వ్యాఖ్యలు
భారతీయ వలసదారులపై “అమెరికా ఈజ్‌ ఫుల్‌” అంటూ ఆ మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. భారత్‌ నుంచి వలస వచ్చినవాళ్లు అమెరికన్ల ఉద్యోగాలను కబ్జా చేస్తున్నారంటూ తీవ్ర పదజాలమే వాడారాయన. దీనిపై ఇండో అమెరికన్‌ కమ్యూనిటీ, టెక్‌ కమ్యూనిటీల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆయన తొలి నుంచి అమెరికన్‌ ఫస్ట్‌ భావజాలం ప్రదర్శిస్తుండడంతో.. ఆ సమయంలో అక్కడి యువత ఆయనకు అండగా నిలబడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement