
కాఠ్మాండు: నేపాల్‌లో జనరేషన్ జెడ్ నిరసనలు ఆ దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్‌మీడియాపై ప్రభుత్వ ఆంక్షల్ని విధించడాన్ని వ్యతిరేకిస్తూ నేపాల్ రాజధాని కాఠ్మాండులో జనరేషన్ జెడ్ యువత రోడ్డెక్కింది. ఆందోళన చేపట్టింది. వీరి ఆందోళనలతో ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. దీంతో ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా తర్వాత తదుపరి ప్రధాని ఎవరు? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఆ దేశంలో సైనిక పాలన అమల్లోకి వచ్చే అవకాశం ఉందంటూ పలు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ క్రమంలో నేపాల్ తదుపరి నూతన ప్రధాని బాలేంద్ర షా (బాలెన్) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సోషల్‌మీడియాపై బ్యాన్, అవినీతిపై ఆందోళన చేస్తున్న యువతే బాలేంద్ర షాకు మద్దతు పలుకుతున్నాయి. అతనే నేపాల్ నూతన ప్రధాని అంటూ సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్ నిర్వయిస్తున్నాయి.

రాపర్ నుంచి మేయర్ వరకు: బాలెన్ షా ప్రయాణం
బాలెన్ షా ఒకప్పుడు అండర్‌గ్రౌండ్ హిప్-హాప్ రాపర్. తన పాటల ద్వారా రాజకీయ అవినీతి, సామాజిక అసమానతలపై విమర్శలు చేశారు. బలిదాన్ అనే పాటకు యూట్యూబ్‌లో ఏడు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందిన బాలెన్, 2022లో స్వతంత్ర అభ్యర్థిగా కాఠ్మాండు మేయర్‌గా ఎన్నికయ్యారు.

జెన్‌జీ ఆవేశాల్ని అర్ధం చేసుకోగలను
నేపాల్‌లో దేశవ్యాప్తంగా సోషల్ మీడియా నిషేధం విధించడంపై ఆందోళన చేపట్టిన జనరేషన్ జెడ్‌కు మద్దతుగా బాలెన్ షా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఈ ఉద్యమం పూర్తిగా జనరేషన్ జెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. వయస్సు పరిమితి కారణంగా వారి ఆందోళనలో నేను పాల్గొనలేను.కానీ వారి ఆవేశాలను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను’అని పేర్కొన్నారు.
నేపాల్‌లో దేశవ్యాప్తంగా సోషల్ మీడియా నిషేధం విధించిన తర్వాత ప్రారంభమైన నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. జనరేషన్ జెడ్ యువత ఆధ్వర్యంలో సాగిన ఈ ఉద్యమంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సైన్యం ఆదేశాలతో ప్రధాని కేపీ శర్మ ఓలి మంగళవారం రాజీనామా చేశారు. ఓలీ తన రాజీనామా లేఖలో.. సమస్యకు రాజకీయ పరిష్కారం అవసరం. అందుకు నేను రాజీనామా చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఓలీ రాజీనామా అనంతరం ఎయిర్‌పోర్టులను మూసివేశారు. మంత్రులను హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు.

‘బాలెన్ దాయ్.. టేక్ ద లీడ్’
ఈ క్రమంలో జనరేషన్ జెడ్ కేపీ ఓలీ తర్వాత తదుపరి ప్రధానిగా బాలెన్ షాయేనంటూ సోషల్ మీడియా క్యాంపెయిన్ చేపట్టింది. పార్టీల కోసం పని చేసే నాయకులు కాదు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు కావాలి’ అనే నినాదంతో బాలెన్ పేరుతో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తున్నారు.‘బాలెన్ దాయ్.. టేక్ ద లీడ్’ అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

రాష్ట్రపతి వద్దకు బాలెన్ షా
ప్రధాని ఓలి రాజీనామాతో రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్ కొత్త నూతన ప్రధాని అభ్యర్ధి పేర్లను పరిశీలిస్తున్నారు. జనరేషన్ జెడ్ సైతం రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్ వద్దకు బాలెన్ షా పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.