
న్యూఢిల్లీ: 2011, మే 2.. తెల్లవారుజామున యునైటెడ్ స్టేట్స్ అత్యంత సాహసోపేతమైన సైనిక కార్యకలాపాలను అమలు చేసింది. పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో 40 నిమిషాల పాటు జరిపిన దాడిలో యూఎస్ నేవీ సీల్స్(US Navy SEALs) 9/11 దాడుల సూత్రధారి, అల్-ఖైదా అధిపతి ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్ ప్రపంచాన్ని షాక్‌నకు గురిచేయడమే కాకుండా, పాకిస్తాన్ విశ్వసనీయత అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతింది. అయితే ఈ సమయంలో చోటుచేసుకున్న పలు పరిణామాలను పాక్ దాస్తూ వచ్చింది. లాడెన్ భార్యలను అమెరికా విచారించిన సంగతిని కూడా ఏనాడూ బహిర్గతం చేయలేదు.
తాజాగా పాక్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ మాజీ ప్రతినిధి ఫర్హతుల్లా బాబర్ రచించిన ‘ది జర్దారీ ప్రెసిడెన్సీ: నౌ ఇట్ మస్ట్ బీ టోల్డ్’ అనే పుస్తకం.. పాక్ ఇంతకాలం దాచుతూ వచ్చిన రహస్యాలను బహిరంగపరచింది. బిన్ లాడెన్ హత్య తర్వాత అతని భార్యలను పాకిస్తాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ (సీఐఎ) బృందం అబోటాబాద్ కంటోన్మెంట్‌లో ప్రత్యక్షమై లాడెన్ భార్యలను విచారించింది. అయితే ఇది పాకిస్తాన్ సార్వభౌమాధికారంపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తించింది. ఈ ఎపిసోడ్ దేశానికి జాతీయ అవమానంగా బాబర్ పేర్కొన్నారు. పాకిస్తాన్ గడ్డపై అమెరికన్ ఏజెంట్లు స్వేచ్ఛగా తిరుగుతుండటంతో పాక్ ప్రభుత్వం, సైన్యం ఒత్తిడికి లోనవుతున్నట్లు కనిపించిందని ఆయన రాశారు. ఈ సంఘటన పాకిస్తాన్‌కు తీవ్ర ఇబ్బందిని కలిగించిందని బాబర్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
నాటి అమెరికా విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్, సెనేటర్ జాన్ కెర్రీతో సహా సీనియర్ అమెరికన్ అధికారులు పాకిస్తాన్‌కు ఎలా వచ్చారో ఈ పుస్తకంలో వివరించారు. ఆ సమయంలో ఇస్లామాబాద్.. భవిష్యత్తులో అమెరికా ఏకపక్ష దాడులకు దూరంగా ఉంటుందని హామీ పొందేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయినప్పటికీ, యునైటెడ్ స్టేట్స్ ఎటువంటి హామీలు ఇవ్వలేదని బాబర్ వివరించారు. ఈ దాడికి చాలా కాలం ముందు నుంచే బిన్ లాడెన్.. అబోటాబాద్ రహస్య స్థావరంపై సీఐఎ నిఘాను సారించడం పాకిస్తాన్‌కు అత్యంత బాధాకరమైన విషయగా మారిందని బాబార్ పేర్కొన్నారు.