
డొనాల్డ్ ట్రంప్.. నిన్న, మొన్నటి వరకూ ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేశారు. సుంకాల విధింపుతో పలు దేశాలకు నిద్ర లేకుండా చేసిన ట్రంప్‌కు ఇప్పుడు నిద్ర కరువైనట్లుంది. చైనా వేదికగా జరిగిన షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సదస్సు తర్వాత ట్రంప్ నోటి మాటలు కచ్చితంగా రావడం లేదు.. వెన్నులో వణుకు పుట్టిన మనిషి ఎలా బాధ పడతాడో అలా వ్యవహరిస్తున్నారు ట్రంప్.
చైనా, భారత్, రష్యాల మైత్రిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమన్నారంటే.. ఆ మూడు దేశాల మైత్రి చాలా కాలం కొనసాగవచ్చు అంటూనే, తాము భారత్, రష్యాలను కోల్పోయామన్నారు. అదే సమయంలో కుట్ర పూరిత చైనాతో భారత్, రష్యాలు జట్టు కట్టడం విచారకమరన్నారు. తమతో దాదాపు ఆ రెండు దేశాల సత్సంబంధాలు తెగిపోయినట్లేనని మరొకవైపు విచారం వ్యక్తం చేశారు.
చైనా వేదికగా జరిగిన షాంఘై సదస్సు, ఆ దేశం నిర్వహించిన అతిపెద్ద.. శక్తివంతమైన సైనిక పరేడ్‌పైనే ట్రంప్ ప్రధానంగా దృష్టి సారించారు. చైనా సైనిక పరేడ్‌కు పుతిన్‌తో పాటు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ హాజరు కావడం కూడా ట్రంప్ నోటిలో ఎలక్కాయ పడ్టట్లు అయ్యింది. నోటి మాట రాక, తన సోషల్ మీడియా సైట్ ‘ట్రూత్’ వేదికగా వరుస పోస్ట్‌లు పెడుతున్నారు ట్రంప్.
ముందుగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఫోటోలు పెట్టి.. తన అసహనం వ్యక్తం చేసిన ట్రంప్.. మళ్లీ గంటల వ్యవధిలోనే చైనా అధ్యక్షుడు, భారత్ ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షులతో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా సైట్‌లో పెట్టి మూడు దేశాల మైత్రిపై స్పందించారు. ఆ మూడు దేశాల మైత్రి చాలా కాలం కొనసాగుతుందంటూనే ఎక్కడో తెలియని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక భారత్, రష్యాలు తమతో లేవనే బాధను కక్కలేక మింగలేక అన్న చందంగా పంచుకున్నారు.
ట్రంప్‌పై వ్యతిరేక స్వరం
ఇక అమెరికాలో ట్రంప్‌పై వ్యతిరేక స్వరం ఎక్కువైంది. ట్రంప్ వ్యతిరేక వర్గం ప్రత్యేకంగా ఆయన చర్యలను తప్పుబడుతోంది. చైనాతో భారత్, రష్యాలు జట్టు కట్టడం కచ్చితంగా ప్రతీ అమెరికన్ వెన్నులో వణుకు పుట్టిస్తుందంటూ ఆ దేశ రాజకీయ విశ్లేషకుడు వేన్ జోన్స్ అభిప్రాయపడ్డారు. చైనాలో జరిగిన షాంఘై సదస్సు మూడు దేశాల(చైనా, రష్యా, భారత్)ల మధ్య జరిగిన చారిత్రాత్మక సదస్సుగా అభివర్ణించారు.
‘ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ మూడు దేశాలు భారీ ఒప్పందాల దిశగా అడుగులు వేశాయి. మోదీ, పుతిన్, జిన్‌పింగ్ కలిసి దిగిన ఫోటోలే అందుకు నిదర్శనం. ఇక్కడ ఇరాన్, నార్త్ కొరియాలు కూడా కలిశాయి. ఇది ప్రతీ అమెరికన్‌కు వెన్నులో వణుకుపుట్టించే అంశం’ అంటూ ట్రంప్ పరిపాలనపై పరోక్షంగా సెటైర్లు వేశారు వేన్ జోన్స్
ట్రంప్‌లో అది పశ్చాత్తాపమేనా?
ఈసారి జరిగిన షాంషై సదస్సు ప్రతీ అమెరికన్ వెన్నులో వణుకే పుట్టించేది అన్న వేన్ జోన్స్ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ ట్రంప్ పదే పదే పోస్టులు పెట్టడం ఇప్పుడు ఆయనకు వెన్నులో వణుకు మొదలైందనడానికి సంకేతంగా చెప్పొచ్చు. అటు భారత్‌పై కాలు దువ్వి, ఇటు రష్యాపై కూడా నువ్వెంత అన్నట్లుగా వ్యవహరించిన ట్రంప్.. ఇప్పుడు తాను చేసిన తప్పుకు కాస్త పశ్చాత్తాపడుతున్నట్లే ఉన్నారు. తాము లేకపోతే ప్రపంచమే లేదు అన్నట్లు వ్యవహరించిన ట్రంప్‌కు చైనా, భారత్, రష్యాలు గట్టి షాక్ ఇవ్వడంతో ‘ వాట్ నెక్స్ట్’ అనే ఆలోచనలో పడ్డారాయన.