సజావుగానే శాంతి ఒప్పందం చర్చలు  | USA President Donald Trump brought up the Abraham Accords | Sakshi
Sakshi News home page

సజావుగానే శాంతి ఒప్పందం చర్చలు 

May 26 2026 4:58 AM | Updated on May 26 2026 4:58 AM

USA President Donald Trump brought up the Abraham Accords

ఇరాన్‌తో చర్చల్లో పాల్గొంటున్న దేశాలు అబ్రహం ఒప్పందాలపై సంతకాలు చేయాలి  

ఒకరిద్దరు సంతకాలు చేయకపోవడానికి తగిన కారణం ఉంటే అంగీకరించవచ్చు  

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడి  

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించడమే లక్ష్యంగా ఇరాన్‌తో చర్చలు సజావుగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం చెప్పారు. ఈ మేరకు ట్రూత్‌ సోషల్‌లో పోస్టుచేశారు. ఇరాన్‌తో శాంతి చర్చల్లో పాల్గొంటున్న దేశాలు.. ఇజ్రాయెల్, అరబ్‌ దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, భద్రతా సంబంధాలను నెలకొల్పే అబ్రహం ఒప్పందాలపై సంతకాలు చేయాలని సూచించారు. ఆ ఒప్పందాలపై ఇరాన్‌ కూడా సంతకం చేయడం గౌరవంగా ఉంటుందని వెల్లడించారు. అత్యంత సంక్లిష్టమైన చిక్కుముడిని విడదీయడానికి అమెరికా కృషి చేస్తోందన్నారు. 

చర్చల్లో పాల్గొంటున్న దేశాలు ఏకకాలంలో అబ్రహం ఒప్పందాలపై సంతకం చేయడం తప్పనిసరి కావాలని ఆకాంక్షించారు. ఒకరిద్దరు సంతకాలు చేయకపోవడానికి తగిన కారణం ఉంటే అంగీకరించవచ్చని తెలిపారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి చర్చల్లో యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్టు, జోర్డాన్‌ భాగస్వామిగా కొనసాగుతున్నాయి. అయితే, యూఏఈ, బహ్రెయిన్‌ దేశాలు అబ్రహం ఒప్పందాలపై ఇప్పటికే సంతకాలు చేశాయి. మిగిలిన దేశాలు కూడా అదే బాటలో నడవాలని ట్రంప్‌ కోరుకుంటున్నారు.  

ఖమేనీ నుంచి ప్రతిస్పందన ఆలస్యం  
ఇరాన్‌ సుప్రీంలీడర్‌ మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం ఎక్కడున్నారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఆయన గుర్తు తెలియని ప్రాంతం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు. ఆయనను కలుసుకోవడం ఇరాన్‌లోని అత్యంత ముఖ్యులకు తప్ప ఇతరులకు సాధ్యపడదు. శాంతి చర్చల విషయంలో అమెరికా ప్రతిపాదనలను మొజ్తబా ఖమేనీకి చేరవేయడం, ఆయన నుంచి ప్రతిస్పందన రావడానికి చాలా సమయం పడుతోందని ఇరాన్‌ అధికారులు చెబుతున్నారు. 

అందుకే శాంతి ఒప్పందం ఖరారు కావడం ఆలస్యమవుతోందని అంటున్నారు. ఒప్పందం ముసాయిదాను ఖమేనీ దాదాపు అంగీకరించారని సీనియర్‌ పరిపాలనా అధికారి ఒకరు చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లో ఇరాన్‌ నుంచి తుది నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో పోస్ట్‌ చేశారు. చాలామంది ఇరాన్‌ నాయకులు పగటి వెలుగు చూడకుండా, వారాల తరబడి అత్యంత పటిష్టమైన బంకర్లలో గడుపుతూ, అవసరమైతే తప్ప ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదని అమెరికా మీడియా వెల్లడించింది.  

చర్చల్లో గణనీయమైన పురోగతి: రూబియో  
హార్మూజ్‌ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్‌తో చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సోమవారం చెప్పారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జాగ్రత్తతో కూడిన వైఖరిని అవలంబిస్తున్నారని, చెడ్డ ఒప్పందాన్ని ఆయన అంగీకరించబోరని తేల్చిచెప్పారు. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. 

ఒప్పందం అత్యవసరమేమీ కాదు: ఇరాన్‌  
అమెరికాతో ఇప్పటికిప్పుడు శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం అత్యవసరమేమీ కాదని ఇరాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్‌ బాఖై స్పష్టంచేశారు. చర్చలో ఉన్న చాలా అంశాలపై ఒక ముగింపునకు వచ్చామని చెప్పడం సరైనదే అవుతుందన్నారు. అయితే, దీని అర్థం ఒప్పందంపై సంతకాలు త్వరలో జరగబోతున్నాయని చెప్పడం కాదని ఉద్ఘాటించారు. అమెరికా, ఇరాన్‌లు ఇప్పటికే ఈ అవగాహనా ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. ఇందులో 60 రోజులపాటు కాల్పుల విరమణ, హార్మూజ్‌ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్‌ అణు కార్యక్రమంపై తదుపరి చర్చల ప్రణాళిక వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం.  

Advertisement
 
Advertisement
Advertisement