క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మందుపాతరలు అమర్చే పడవలు ధ్వంసం
కేవలం ఆత్మరక్షణ కోసమే దాడులు చేశామన్న అమెరికా
అమెరికా దుశ్చర్యను తీవ్రంగా ఖండించిన ఇరాన్
వాషింగ్టన్/దుబాయ్: అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణతో కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న పశ్చిమాసియాలో మళ్లీ ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం విషయంలో ముందడుగు వేశామని ఒకవైపు అమెరికా అధ్యక్షుడు చెబుతుండగా, మరోవైపు అమెరికా సైన్యం సోమవారం దక్షిణ ఇరాన్‌పై భీకర దాడులకు పాల్పడింది. బందర్ అబ్బాస్ సహా పలు ప్రాంతాల్లో ఇరాన్ సైనిక స్థావరాలపై నిప్పులు వర్షం కురిపించింది. ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సముద్రంలో మందుపాతరలు అమర్చే పడవలను ధ్వంసం చేసినట్లు అమెరికా మిలటరీ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టేన్ టిమ్ హాకిన్స్ సోమవారం ప్రకటించారు.
ఇవి కేవలం తమ ఆత్మరక్షణ కోసం జరిగిన దాడులేనని వివరణ ఇచ్చారు. ఇరాన్ దళాల ముప్పు నుంచి తమ సైనికులను కాపాడుకోవడానికి దాడులకు చేయక తప్పలేదన్నారు. అయితే, ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది కాబట్టి తాము చాలా సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. అమెరికా దాడుల్లో ఇరాన్‌కు ఏ మేరకు నష్టం వాటిల్లిందన్నది ఇంకా తెలియరాలేదు.
పడవలపై అమెరికా దాడులు చేయడంతో నలుగురు ఇరాన్ జవాన్లు మరణించినట్లు ‘తబ్నాక్’అనే వార్తా సంస్థ వెల్లడించింది. హార్మూజ్ జలసంధిపై ఉన్న, సైనిక ఓడరేవుతోపాటు విమానాశ్రయం కలిగిన బందర్ అబ్బాస్ నగర పరిసరాల్లో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది. తాజా దాడులు కాల్పుల విరమణ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 7 నుంచి కాల్పుల విరమణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
శాంతి యత్నాలకు భంగం కలిగించొద్దు: ఇరాన్
అమెరికా దాడులను ఇరాన్ మంగళవారం తీవ్రంగా ఖండించింది. ఈ పరిణామాన్ని దురుద్దేశం, విశ్వసనీయత లేమికి సంకేతంగా అభివర్ణించింది. శాంతి యత్నాలకు భంగం కలిగించే చర్యలకు పూనుకోవద్దని సూచించింది. కాల్పుల విరమణను అమెరికా ఉల్లంఘినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విమర్శించింది. తదుపరి అన్ని పరిణామాలకు అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.
ఏ దురాక్రమణ చర్యకైనా జవాబు ఇవ్వకుండా ఇరాన్ వదిలిపెట్టదని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. ఇదిలా ఉండగా, పశ్చిమాసియాలో శాంతి సాధన కోసం ఖతార్‌లో చర్చల కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘలిబాఫ్ ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. చర్చలు సజావుగా సాగుతున్నాయని, ఒప్పందం విషయంలో తాము తొందరపడడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం స్పష్టంచేశారు.
అమెరికా డ్రోన్లు, ఫైటర్ జెట్‌ను కూల్చాం: ఐఆర్‌జీసీ
అమెరికాకు బుద్ధి చెప్పామని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్‌జీసీ) ప్రకటించింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా డ్రోన్లను, ఒక యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తెలిపింది. అయితే, ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్నది బయటపెట్టలేదు.
ఆ యురేనియంను నాశనం చేయాల్సిందే: ట్రంప్
ఇరాన్ వద్దనున్న శుద్ధిచేసిన యురేనియం(అణు ధూళి)ను నాశనం చేయాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికాకు తరలించి, నాశనం చేయవచ్చని చెప్పారు. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) ఆధ్వర్యంలో మరొక ఆమోదయోగ్యమైన ప్రదేశంలో నాశనం చేయడానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఆ యురేనియంను అక్కడికక్కడే నామరూపాల్లేకుండా చేసినా అభ్యంతరం లేదన్నారు. ఇరాన్ వద్దనున్న యురేనియంను తమకు అప్పగించాలని, అలాగైతేనే ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి అంగీకరిస్తామని ట్రంప్ ఇప్పటిదాకా షరతు విధించిన విషయం విదితమే. కానీ, తాజాగా ఆయన తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో పోస్టుచేశారు.


