ట్రంప్‌ బాల్‌రూమ్‌ ప్రాజెక్ట్‌కు కోర్టు బ్రేక్‌  | US District Judge judge orders halt to White House ballroom construction | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ బాల్‌రూమ్‌ ప్రాజెక్ట్‌కు కోర్టు బ్రేక్‌ 

Apr 2 2026 4:56 AM | Updated on Apr 2 2026 10:00 AM

US District Judge judge orders halt to White House ballroom construction

అధ్యక్షుడు వైట్‌హౌస్‌ సంరక్షకుడు మాత్రమే.. యజమాని కాదు  

పనులు తాత్కాలికంగా నిలిపివేయాలి  

యూఎస్‌ జిల్లా జడ్జి లియోన్‌ ఆదేశాలు  

డొనాల్డ్‌ ట్రంప్‌  అభ్యంతరం

వాషింగ్టన్‌: తన అభిరుచులకు తగ్గట్టుగా నిర్మించుకుంటున్న బాల్‌రూమ్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 400 మిలియన్‌ డాలర్ల విలువైన బాల్‌రూమ్‌ నిర్మాణం కోసం వైట్‌హౌస్‌ తూర్పు భాగాన్ని కూల్చివేయడాన్ని, కాంగ్రెస్‌ ఆమోదం లేకుండా పనులు చేపట్టాన్ని వాషింగ్టన్‌లోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి రిచర్డ్‌ లియోన్‌ తప్పుపట్టారు. పనులు తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు.

 కాంగ్రెస్‌ ఆమోదం లేకుండా ముందుకెళ్లడానికి వీల్లేదన్నారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రంప్‌ బాల్‌రూమ్‌ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ‘నేషనల్‌ ట్రస్టు ఫర్‌ హిస్టోరిక్‌ ప్రిజర్వేషన్‌’గ్రూప్‌ కోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జడ్జి రిచర్డ్‌ లియోన్‌ విచారణ చేపట్టారు. ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చారు. అమెరికా అధ్యక్షుడు వైట్‌హౌస్‌ సంరక్షకుడు మాత్రమేనని, ఆ భవనానికి యజమాని కాదని న్యాయమూర్తి స్పష్టంచేశారు. 

భవిష్యత్తులో వైట్‌హౌస్‌లోకి రాబోయే అధ్యక్షుడి కుటుంబాల కోసం ఆ భవనాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు పదవిలో ఉన్న అధ్యక్షుడిపై ఉందన్నారు. అయితే, కోర్టు నిర్ణయం పట్ల ట్రంప్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా జడ్జి ఉత్తర్వును సవాలు చేస్తూ న్యాయస్థానంలో అప్పీల్‌ దాఖలు చేయడానికి శ్వేతసౌధం నోటీసు ఇచ్చింది. వైట్‌హౌస్‌ ప్రాంగణంలో ఎన్నో కట్టడాలు నిర్మించామని, వాటికి కాంగ్రెస్‌ నుంచి ఆమోదం లేదని ట్రంప్‌ చెప్పారు. 

ఆయా కట్టడాలకు లేని అభ్యంతరం బాల్‌రూమ్‌కు ఎందుకని ప్రశ్నించారు. ప్రైవేట్‌ విరాళాలతో నిర్మిస్తున్న భవనాన్ని వ్యతిరేకించడం సరికాదని చెప్పారు. కోర్టు ఉత్తర్వుతో సంబంధం లేకుండా బాల్‌రూమ్‌ కింద భూగర్భంలో బంకర్‌తోపాటు ఇతర భద్రతాపరమైన పనులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టంచేశారు. బాల్‌రూమ్‌ ప్రాజెక్టు పట్ల ట్రంప్‌ అమితాసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇందుకోసం ప్రైవేట్‌ సంస్థల నుంచి, ప్రజల నుంచి నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టారు. 90,000 చదరపు అడుగుల బాల్‌రూమ్‌ నిర్మాణం కోసం వైట్‌హౌస్‌ ప్రాంగణంలోని ఈస్ట్‌ వింగ్‌ను కూల్చేశారు. 1945లో హ్యారీ ఎస్‌.ట్రూమ్యాన్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైట్‌హౌస్‌ దక్షిణ భాగంలో బాల్కనీ నిర్మించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement