మంచు తుపాన్‌ కోరల నుంచి బయటపడని అమెరికా.. కనీవినీ ఎరగని స్థాయిలో విధ్వంసం

US digs out from monster storm as death toll passes increase - Sakshi

యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు

భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య

వేలాదిగా రద్దువుతున్న విమానాలు

ప్రయాణికులకు తీవ్ర అగచాట్లు

బఫెలో: ఈ శతాబ్దంలోకెల్లా అత్యంత తీవ్రమైన మంచు తుపాన్‌ (Bomb Cyclone) కోరల నుంచి అమెరికా ఇంకా బయట పడలేదు. గత వారం రోజులతో పోలిస్తే హిమపాతం కాస్త తగ్గినా దేశవ్యాప్తంగా అతి శీతల వాతావరణం కొనసాగుతోంది. రోడ్లపై దట్టంగా పేరుకున్న మంచును తొలగించడంతో పాటు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించడం వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.

దాంతో తుఫాన్‌  విధ్వంసం తాలూకు తీవ్రత క్రమంగా వెలుగులోకి వస్తోంది. మంచులో కూరుకుపోయిన కార్లలో నిస్సహాయంగా మరణించిన వారి శవాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. మంచు తుఫాన్‌ ధాటికి కనీసం 100 మందికి పైగా మృత్యువాత పడ్డట్టు భావిస్తున్నారు. దీన్ని తరానికి ఒక్కసారి మాత్రమే సంభవించే మహోత్పాతంగా వాతావరణ శాఖ అభివర్ణిస్తోంది.

మెరుగవని రవాణా వ్యవస్థ
దేశవ్యాప్తంగా వారం రోజులుగా దాదాపుగా స్తంభించిపోయిన రవాణా వ్యవస్థ ఇంకా కుదురుకోలేదు. మంగళవారం కూడా 6,000కు పైగా విమానాలు రద్దయ్యాయి. బుధవారం బయల్దేరాల్సిన 3,500 పై చిలుకు విమానాలను ముందస్తుగానే రద్దు చేశారు. దాంతో విమానాశ్రయాల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. చిక్కుబడిపోయిన ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బయటికెళ్లే పరిస్థితి లేక ప్రయాణికులంతా టెర్మినల్స్‌లోనే కాలం గడుపుతున్నారు.

డిసెంబర్‌ 22 నుంచి రద్దయిన విమానాల సంఖ్య 25 వేలు దాటింది. సకాలంలో సేవలను పునరుద్ధరించడంలో సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ వైఫల్యం పరిస్థితిని మరింత జటిలంగా మార్చింది. సంస్థకు చెందిన వేలాది విమాన సర్వీసులు వరుసగా ఆరో రోజూ రద్దవడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ఆగ్రహించారు. ఎయిర్‌లైన్స్‌ నుంచి భారీగా నష్టపరిహారం వసూలు చేయాలని ప్రయాణికులకు సూచించారు! కానీ పరిస్థితి చక్కబడేందుకు కనీసం ఇంకో వారం పట్టొచ్చని సౌత్‌వెస్ట్‌ ప్రకటించింది.

యథేచ్ఛగా లూటీలు
రవాణా వ్యవస్థ స్తంభించడంతో అమెరికాలో చాలా ప్రాంతాల్లో నిత్యావసరాలు తదితరాల సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దాంతో చాలా రాష్ట్రాల్లో ఆకలి కేకలు విన్పిస్తున్నాయి. బయటికెళ్లే పరిస్థితి లేక జనం రోజుల తరబడి ఇళ్లకే పరిమితం కావడంతో ఆహార పదార్థాలు నిండుకున్నాయి. నాలుగైదు రోజులుగా దుకాణాలూ తెరిచుకోక సమస్య మరింతగా విషమించింది.

ఫలితంగా మొన్నటిదాకా బఫెలో నగరంలోనే వెలుగు చూసిన లూటీ ఉదంతాలు ఇప్పుడు పలు రాష్ట్రాల్లోనూ నమోదవుతున్నాయి. ముఖ్యంగా నిత్యావసరాల కోసం దుకాణాల్లోకి చొరబడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న లక్షలాది మంది తెలుగువాళ్లు కూడా నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కెనడాలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఉష్ణోగ్రతలు మైనస్‌ 50 డిగ్రీల కంటే తక్కువ నమోదవున్నాయి!

వరద ముప్పు
క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అమెరికా ఇప్పుడు వరద ముప్పును ఎదుర్కొంటోంది. మంచు శరవేగంగా కరగడం వల్ల ఊహాతీత వేగంతో ఆకస్మిక వరదలు ముంచెత్తవచ్చని పలు రాష్ట్రాలను వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. పూర్తిగా మంచులో కూరుకుపోయిన బఫెలో వంటి ప్రాంతాలకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొంది.

బఫెలో.. దయనీయం!
పశ్చిమ న్యూయార్క్‌లోని బఫెలో నగరంలో ఇంకా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. చాలాచోట్ల ఇంకా 8 అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది. దాంతో అవసరాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు అత్యవసర సర్వీసులు కూడా సకాలంలో చేరుకోలేని పరిస్థితి! నగరంలోకి వెళ్తుంటే యుద్ధరంగంలోకి ప్రవేశిస్తున్నట్టుగా ఉందని న్యూయార్క్‌ గవర్నర్‌ కేథీ హోచల్‌ వాపోయారు.

నగరం, పరిసరాల్లో రోడ్డు ప్రయాణాలపై నిషేధం ఇంకా అమల్లోనే ఉంది.  దాని అమలుకు మిలిటరీ పోలీసులు రంగంలోకి దిగారు. పొరుగు రాష్ట్రం న్యూజెర్సీ నుంచి ఎమర్జెన్సీ సేవల సిబ్బంది న్యూయార్క్‌కు తరలుతున్నారు. చాలామంది కార్లలోనే చిక్కుకుపోయి ఉన్నారు. 30కి పైగా మృతదేహలను వెలికితీసినట్టు చెబుతున్నారు. ఇంతటి ప్రతికూల వాతావరణాన్ని తమ సర్వీసులోనే ఎన్నడూ చూడలేదని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యల్లో భాగంగా సిబ్బంది ఇంటింటికీ తిరుగుతున్నారు.

చావు అంచుల దాకా వెళ్లాం
మంచు తుఫాను బారిన పడి అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డవాళ్లు తామెదుర్కొన్న కష్టాలను కథలుగా చెబుతున్నారు. మేరీలాండ్‌కు చెందిన డిట్జక్‌ ఇలుంగా అనే వ్యక్తి తన ఆరు, పదహారేళ్ల కూతుళ్లతో కలిసి కార్లో హామిల్టన్‌ వెళ్తూ బఫెలో వద్ద తుఫానులో చిక్కాడు. చూస్తుండగానే కారు చుట్టూ మంచు పేరుకుపోవడంతో గంటల తరబడి కారు ఇంజన్‌ ఆన్‌లో ఉంచి బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు.

‘‘చివరికి ప్రాణాలకు తెగించాం. ధైర్యం చేసి కష్టమ్మీద కారు దిగాం. చిన్న కూతుర్ని వీపున వేసుకుని, పెద్దమ్మాయీ నేనూ భయానక వాతావరణంలో అతికష్టమ్మీద షెల్టర్‌ హోమ్‌ దాకా వెళ్లాం. లోపలికి అడుగు పెడుతూ నేనూ నా పిల్లలూ ఒక్కసారిగా ఏడ్చేశాం. ఇంతటి భయానక అనుభవం జీవితంలో ఎన్నడూ ఎదుర్కోలేదు. ఒక్క అడుగూ వేయడానికి ప్రాణాలన్నీ కూడదీసుకోవాల్సి వచ్చింది. కానీ సాహసం చేయకపోతే కార్లోనే నిస్సహాయంగా మరణించేవాళ్లం’’ అంటూ డిట్జక్‌ గుర్తు చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top