ఇండో–పసిఫిక్ దేశాల భద్రతకు కట్టుబడి ఉన్నాం
షాంగ్రి–లా సదస్సులో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్
సింగపూర్: ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడం ఇప్పటికీ తమ లక్ష్యంగానే ఉందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. అదేవిధంగా, పసిఫిక్ సముద్ర ప్రాంత దేశాల భద్రతకు అమెరికా కట్టుబడి ఉంటామన్నారు. అమెరికా భద్రతకు వికాసానికి ఈ ప్రాంతం చాలా కీలకమైందని చెప్పారు. పసిఫిక్ రీజియన్‌లో సుస్థిరమైన, సానుకూల అధికార సమతుల్యతను సాధించడమే తమ లక్ష్యమని చెప్పారు.
సింగపూర్‌లో జరుగుతున్న షాంగ్రి–లా రక్షణ సదస్సులో శనివారం హెగ్సెత్ మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా చైనా సైనిక పాటవాన్ని పెంచుకుంటుండటంపై ఈ ప్రాంతంలోనే కాదు మిగతా దేశాల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందన్నారను. ఇక్కడి భద్రతా వాతావరణంపై తమకు స్పష్టమైన అంచనా ఉందన్నారు.
పసిఫిక్ ప్రాంతం ఏదో ఒక దేశం ఆధిపత్యంలోకి వెళ్తే అది ప్రాంతీయ శక్తి సమతుల్యతను దెబ్బతీస్తుందని, మనం పరరిక్షించుకోవాలని ప్రయత్నిస్తున్న సమతుల్యత ప్రమాదంలో పడుతుందన్న విషయం తమకు తెలుసునని హెగ్సెత్ పేర్కొన్నారు. అందుకే, చైనాయే కాదు, మరే దేశమూ ఈ ప్రాంతంపై ఆధిపత్యం నెలకొల్పుకునే అవకాశం తాము ఇవ్వబోమని స్పష్టం చేశారు. అదే సమయంలో చైనాతో తాము ఘర్షణాత్మక వైఖరిని ఆవలంభించబోమని చెప్పారు.
ఇటీవల ట్రంప్, జిన్ పింగ్ మధ్య జరిగిన భేటీని ప్రస్తావిస్తూ హెగ్సెత్..అమెరికా, చైనాలు తమ ప్రయోజనాలను కాపాడుకుంటూనే పరస్పర ప్రయోజనాల విషయంలో ఆచరణాత్మకమైన ఒప్పందాలను కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. న్యాయబద్ధమైన, పరస్పర సహకారంతో కూడిన వ్యూహాత్మక, నిర్మాణాత్మక సంబంధాలను నెలకొల్పుకునేందుకు అంగీకరించారని చెప్పారు.
మిత్ర దేశాలు రక్షణ వ్యయాన్ని పెంచుకోవాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందంటూ ఆయన..ఈ విషయంలో పలు ఆసియా దేశాలు చేస్తున్న ప్రయత్నాలను కొనియాడారు. కేవలం ఆదర్శప్రాయమైన సిద్ధాంతాలను కాకుండా దేశ ప్రయోజనాల పరిరక్షణకే ప్రాధాన్యం ఇస్తున్నాయని చెప్పారు. అదే సమయంలో యూరప్ దేశాల వైఖరిని హెగ్సెత్ తప్పుబట్టారు. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్(ఐఐఎస్‌ఎస్) ఆధ్వర్యంలోని సింగపూర్‌లోని షాంగ్రి–లా హోటల్‌లో 2002 నుంచి జరుగుతున్న ఈ సదస్సుకు భారత్ సహా 30కిపైగా దేశాల నుంచి అగ్ర నేతలు, దౌత్యవేత్తలు, రక్షణ శాఖల అధికారులు హాజరవుతారు.
భారత్–పాక్ ఘర్షణను ట్రంప్ ఆపారు
గతేడాది భారత్, పాకిస్తాన్‌ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతోనే సమసిపోయాయని హెగ్సెత్ పేర్కొన్నారు. అణు సామర్థ్యం ఉన్న ఈ రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడంలో ట్రంప్ చేసిన కృషి అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. భారత్, పాక్‌ల నాలుగు రోజుల సంక్షోభాన్ని తానే నివారించానంటూ ట్రంప్ గతంలో పలుమార్లు ప్రకటించుకోగా, భారత్ ఖండించడం తెల్సిందే.


