
భారత్‌పై అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్ ఆగ్రహం
న్యూయార్క్: భారత్‌పై అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్ కక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. 140 కోట్ల జనాభా ఉన్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న భారతదేశం అమెరికా నుంచి ఒక్క మొక్కజొన్న కంకి కూడా కొనడంలేదని వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు. అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు తగ్గించాలి లేదా తమ నుంచి వ్యాపారపరంగా ఎదురయ్యే గట్టి పోటీని తట్టుకోవాలని భారత్‌కు తేల్చిచెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లుట్నిక్ మాట్లాడారు.
కొన్ని దేశాల విషయంలో స్నేహం ఒకవైపు నుంచే కొనసాగుతోందని అన్నారు. తాము స్నేహం చేస్తున్న దేశాలు తమను వాడుకొని లాభపడుతున్నాయని విమర్శించారు. వారి ఉత్పత్తులను అమెరికాలో విక్రయించుకుంటూ, అమెరికా ఉత్పత్తులను మాత్రం వారి దేశాల్లో అనుమతించడం లేదని తప్పుపట్టారు. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల్లో అమెరికాకు ప్రవేశం కల్పించడం లేదన్నారు. బంధం అనేది ఇరువైపుల నుంచి ఉండాలని తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు గుర్తుచేశారు.
140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం అమెరికా నుంచి ఒక్క మొక్కజొన్న కంకి కూడా ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇండియాది తప్పుడు విధానం కాదా? అని ప్రశ్నించారు. ఇండియా ఉత్పత్తులను అమెరికాలోకి అనుమతిస్తున్నామని, అదే పని ఇండియా ఎందుకు చేయడం లేదని పేర్కొన్నారు. పైగా తమ ఉత్పత్తులపై ఇండియాలో టారిఫ్‌లు అధికంగా ఉన్నాయని ఆక్షేపించారు. ఎదుటివారు మనకు ఎలాంటి మర్యాద ఇస్తారో మనం కూడా వారికి అలాంటి మర్యాదే ఇవ్వాలన్నది అమెరికా విధానమని లుట్నిక్ స్పష్టంచేశారు.