
భారత్–పాక్ ఘర్షణలో జోక్యం చేసుకోబోమని స్పష్టికరణ
గతంలో ఘర్షణ జరిగిన ప్రతిసారీ పాక్‌కు అమెరికా వత్తాసు
ఈసారి పాక్ బుద్ధి తెలిసి దూరం పెట్టిన ట్రంప్ యంత్రాంగం
విస్పష్టమైన ప్రకటన చేసిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
దిక్కు తోచని స్థితిలో దాయాది దేశం..
గిల్లి కయ్యం పెట్టుకోవటం.. గట్టిగా నాలుగు దెబ్బలు తగిలేసరికి అమెరికా కాళ్లపై పడి కాపాడాలని వేడుకోవటం.. ఆ దేశం వెంటనే రంగంలోకి దిగి భారత్‌కు నచ్చజెప్పి వెనక్కు తగ్గేలా చేయటం.. 1971 నుంచీ పాకిస్తాన్ తీరు ఇదే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పాకిస్తాన్ దుష్టబుద్ధి అమెరికా పాలకులకు కూడా తెలిసి వచ్చింది. పొరుగుదేశంతో నువ్వు గొడవ పెట్టుకుంటే నిన్ను నేనెందుకు కాపాడాలని అమెరికా నిలదీస్తోంది. ‘భారత్–పాక్ సైనిక ఘర్షణలో జోక్యం చేసుకోవటం మా పని కాదు’అని అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ విస్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో దాయాది దేశానికి దిక్కు తోచటం లేదు.
కాపాడుతూ వచ్చిన అమెరికా
1971 యుద్ధం, 1999 కార్గిల్ యుద్ధం, 2001లో ఘర్షణ, 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ వైమానిక దాడులు.. ఇలా భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న ప్రతిసారీ పాకిస్తాన్ పాలకులు రాత్రికి రాత్రి అమెరికాలో వాలిపోయి కాపాడాలని ఆ దేశ పెద్దలకు మొరపెట్టుకున్నారు. నాడు పాకిస్తాన్ పక్షపాతిగా ఉన్న అమెరికా అడిగిందే తడవుగా రంగంలోకి దిగి భారత్‌తో చర్చలు జరిపి శాంతించేలా చేసేది. 1971 యుద్ధ సమయంలో పాక్‌కు మద్దతుగా ఏకంగా అణ్వాయుధాలు గల విమాన వాహక నౌక యూఎస్‌ఎస్‌ఆర్ ఎంటర్‌ప్రైజ్ నాయకత్వంలో 7వ ఫ్లీట్‌ను బంగాళాఖాతంలో మోహరించింది.
1999లో జమ్మూకశ్మీర్‌లోని కార్గిల్‌ను ఉగ్రమూకల ముసుగులో పాక్ సైన్యం ఆక్రమించింది. ఆలస్యంగా గుర్తించిన భారత సైన్యం.. భీకర దాడులతో వారిని తరిమికొట్టింది. అంతటితో వదలకూడదని పాక్‌పై సైనిక చర్యకు ప్రణాళిక వేసింది. భారీగా యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను సరిహద్దులకు తరలించింది. తన గూఢచారి ఉపగ్రహాల ద్వారా ఈ విషయాన్ని అమెరికా పసిగట్టి పాక్‌కు ఉప్పందించింది. దీంతో భయపడిన నాటి పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్.. అమెరికాకు పరుగు పెట్టి అప్పటి అగ్రరాజ్య అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో సమావేశమయ్యాడు.
మొదట కార్గిల్‌ను తాము ఆక్రమించలేదని బుకాయించిన నవాజ్‌షరీఫ్.. క్లింటన్‌తో సమావేశం తర్వాత 1999, జూలై 12న కార్గిల్ నుంచి వెనక్కు తగ్గుతున్నట్లు ప్రకటించటం గమనార్హం. 2001లో పాక్ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి చేయటంతో రెండు దేశాలు మరోసారి యుద్ధం ముందు నిలిచాయి. ఆ సమయంలో కూడా పాక్‌ను కాపాడేందుకు అమెరికా జోక్యం చేసుకుంది. తన రాయబారిని ఢిల్లీకి పంపి భారత్‌ను శాంతింపజేసింది. ఇలా దౌత్యంతోపాటు ఎప్పటికప్పుడు ఆయుధాలు, అత్యాధునిక యుద్ధ విమానాలు కూడా సరఫరా చేస్తూ పాకిస్తాన్‌ను అగ్రరాజ్యం కాపాడుతూ వచ్చింది. ఎఫ్–16 సూపర్‌సోనిక్ యుద్ధ విమానాలను కూడా పాక్‌కు అందించింది.
కాలం మారింది.. కథ అడ్డం తిరిగింది
చాలాకాలంపాటు ఆత్మరక్షణ విధానాన్నే అవలంబించిన భారత్.. కొంతకాలంగా దూకుడుగా వెళ్తోంది. అంతర్జాతీయ సమాజంలో పేరుప్రతిష్టలు పెంచుకోవటంతోపాటు తెలివైన దౌత్య విధానాలతో కొత్త మిత్రులను సంపాదిస్తోంది. ఈ క్రమంలో భారత్ పట్ల అమెరికా వైఖరిలోనూ స్పష్టమైన మార్పు వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. జేడీ వాన్స్ ప్రకటనే అందుకు ఉదాహరణ అని పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణపై ఇటీవల ఆయన ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో స్పష్టమైన ప్రకటన చేశారు. ‘చూడండి.. ఆయుధాలు వదిలేయాలని భారత్‌కుగానీ, పాకిస్తాన్‌కు గానీ మేము చెప్పలేము.
ఈ ఘర్షణలో జోక్యం చేసుకోవటం మా పని కూడా కాదు. దౌత్య మార్గాల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మేము మొదటి నుంచీ చెబుతున్నాం. ఈ ఘర్షణ తీవ్రస్థాయి యుద్ధంగా, అణు యుద్ధంగా మారబోదనే నమ్ముతున్నాం’అని వాన్స్ పేర్కొన్నారు. వాన్స్ ప్రకటనతో దిక్కుతోచని స్థితిలో పడిన పాక్‌పై.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు మద్దతుదారైన నిక్కీ హేలీ మరో బాంబు వేశారు. పహల్గాంలో సామాన్యులను చంపిన ఉగ్రవాదులను శిక్షించే హక్కు, అధికారం భారత్‌కు ఉన్నాయని ఆమె ఎక్స్ వేదికగా స్పష్టంచేశారు. బాధితురాలిగా నటించొద్దని పాక్‌కు చురకలంటించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్