
ఏకంగా 35.9 అడుగుల ఎత్తు పెరిగిన పొద్దుతిరుగుడు మొక్క
అమెరికాలో పండించిన ఉక్రెయిన్ శరణార్థి
వలసదేశంలో తనను తలెత్తుకు తిరిగేలా చేసిందని ఆనందం వ్యక్తం చేసిన అలెక్స్
పొద్దు తిరుగుడు పువ్వు. సూర్యరశ్శిపై ప్రేమతో తదేకంగా ఆదిత్యుడినే చూస్తే అతను ఎటువైపు మళ్లితే ఆ దిశగా తిరుగుతూ తన ప్రేమను ప్రదర్శించే పొద్దు తిరుగుడు పువ్వు. సూరీడు కిందకు వాలేకొద్దీ సరిగా కనిపించట్లేడని అనుకుందో ఏమో ఇంకాస్త పైకి నిక్కి నిక్కి చూసింది. అలా అలా పైపైకి ఎదిగింది. ఆపకుండా ఎదుగుతూ ఏకంగా 35.9 అడుగుల ఎత్తుకు పెరిగింది. అమాంతం అంతెత్తుకు పెరిగి నేరుగా గిన్నిస్ ప్రపంచ రికార్డుల పుస్తకంలోకి ఎక్కేసింది.
ఉక్రెయిన్ నుంచి అమెరికాకు వలసవచ్చిన 47 అలెక్స్ బాబిక్ ఈ మొక్కను కంటికి రెప్పలా కాపాడుతూ దాని బాగోగులు చూసుకుంటున్నారు. టెలిఫోన్ స్తంభం అంత ఎత్తుకు పెరిగిన ఈ మొక్కకు బుధవారమే గిన్నిస్ ప్రపంచ రికార్డ్ అధికారులు అధికారిక రికార్డ్ ధృవీకరణ పత్రాన్ని జారీచేశారు. దీంతో దీని పెంపకం దారు అలెక్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మొక్కకు ముద్దుగా ‘క్లవర్’అని పేరు పెట్టుకున్నారు. అనుకోకుండా మొదలైన ఈ మొక్క పోషణపర్వాన్ని అలెక్స్ ఆనందంగా మీడియాతో పంచుకున్నారు.
ఇష్టంతో మొదలై..
‘‘ఉక్రెయిన్‌లో చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు, దారుణమైన రేడియోధారి్మకత విషాదం కారణంగా 14 ఏళ్ల వయసులో నేను 1991లో అమెరికాకు వలసవచ్చా. అయినాసరే నాకు స్వదేశం ఉక్రెయిన్ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఉక్రెయిన్ జాతీయ పుష్పం అయిన పొద్దుతిరుగుడు పువ్వులను పెంచాలని నిర్ణయించుకున్నా. అందుకే ఏడేళ్ల క్రితం సన్‌ఫ్లవర్ మొక్కల పెంపకాన్ని మొదలెట్టా. నేను పెంచిన మొట్టమొదటి పొద్దుతిరుగుడు మొక్క 13 అడుగుల ఎత్తు పెరిగింది. తర్వాతది 15 అడుగులు.
ఆ తర్వాతది 19 అడుగులు. దీంతో అసలు ఈ మొక్కలు ఎంత ఎత్తు పెరుగుతాయి? ఇంకా ఎత్తు పెంచాలంటే ఏం చేయాలి? అనే కుతూహలం, ఉత్సహం నాలో పెరిగాయి. ఆ ప్రేరణ నుంచి పట్టిందే ఈ మొక్క. నా పదేళ్ల కొడుకు సైతం మొక్క పెంపకంలో ఎంతో సాయపడ్డాడు. ఈ మొక్కకు క్లవర్ అని పేరు పెట్టింది కూడా వాడే. నాలుగు ఆకులు జతగా ఉండే క్లవర్ జాతి పెద్ద ఆకును ఈ మొక్క మీద పెట్టి మంచి జరగాలని రోజూ కోరుకునేవాడు. మేం ఏరో ఒకరోజు చనిపోతాం. కానీ ఈ మొక్క గురించి అందరూ మాట్లాడుకుంటారు. నా పిల్లలు వారి పిల్లలకూ ఈ మొక్క ఘనచరిత్రను చెబుతారు’’అని అలెక్స్ అన్నారు.
అందరి సమక్షంలో కొలత
సెపె్టంబర్ మూడోతేదీన ఈ మొక్క ఎత్తును అందరి సమక్షంలో అధికారికంగా కొలిచారు. స్థానిక వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని తోటపని నిపుణులు, అలెన్ కౌంటీ తూనికలు, కొలత విభాగాధికారులు, గిన్నిస్ రికార్డ్ ప్రతినిధి, ఫోర్ట్ వేనీ కొమిట్స్ మైనర్ లీగ్ ఐస్ హాకీ బృంద మస్కట్ ఐసీ డీ ఈగల్ సహా చాలా మంది ఈ మొక్క ఎంత ఎత్తు పెరిగిందా? అని చూసేందుకు ఎగబడ్డారు. 35 అడుగుల 9 అంగుళాల ఎత్తు ఉందని తేల్చారు. ‘‘గిన్నిస్ రికార్డ్ బద్దలుకొట్టామన్న ఆనందానికి అంతేలేకుండా పోయింది. నా కుమారుడు ఎగిరి గంతేశాడు. ఈ మొక్క నేను వలసదేశంలో తలెత్తుకు తిరిగేలా చేసింది. రికార్డ్ అనేది నిజంగా ఎంతో భావోద్వేగంతో కూడింది’’అని అలెక్స్ ఆనందం వ్యక్తంచేశారు.
పాడవ్వకుండా చుట్టూ కంచె
ఎవరూ ఈ మొక్కను తాకకుండా చుట్టూ కంచె ఏర్పాటుచేశారు. ఈ మొక్క పడిపోకుండా 35 అడుగుల పొడవునా చుట్టూ తోడ్పాటుగా మూడు నిచ్చెల నిర్మా ణాన్ని సిద్ధంచేశారు. ఇది సరిగా పెరుగుతుందో లేదో తెల్సుకోవడానికి మరో భారీ నిచ్చెనను దీనిని బిగించారు. ఇంటి పెరట్లో అంతెత్తున పెరుగుతున్న మొక్క అలెక్స్ కుటుంబంలో భాగంగా మారిపోయింది. ‘‘2022లో ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ మొదలయ్యాక స్వదేశంపై ప్రేమ మరింత పెరిగింది. మారణహోమం అంతమవ్వాలని మేం కోరుకుంటున్నాం’’అని అలెక్స్ అన్నారు.
చరిత్రలో సన్‌ఫ్లవర్ మొక్క..
ఉక్రెయిన్‌లో పొద్దుతిరుగుడు సాగు ఎక్కువ. అక్కడి నుంచి భారత్‌కు సైతం సన్‌ఫ్లవర్ నూనె దిగుమతులు ఎక్కువే. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలోనూ పొద్దుతిరుగుడు పువ్వు ప్రస్తావన వచి్చంది. యుద్ధం మొదట్లో ఉక్రెయిన్ శివారుభూభాగంలోకి రష్యా సైనికులు చొరబడినప్పుడు అక్కడి ఒక ఉక్రెయిన్ మహిళ అడ్డుకుంది. రష్యా సైనికుడితో.. ‘‘కొన్ని పొద్దుతిరుగుడు గింజలు నీ జేబులో వేసుకో. ఇక్కడ నువ్వు చచి్చపోయి పాతిపెడితే ఆ గింజలు మొలకెత్తి మొక్కగానైనా మళ్లీ పుడతావు’’అన్న వీడియో అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో తెగ షేర్ అయింది. 1996లోనూ అణ్వస్త్ర నిరాయుధీకరణ కార్యక్రమంలో భాగంగా పెర్వోమిస్క్ క్షిపణి స్థావరంలో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ మంత్రులు సన్‌ఫ్లవర్ మొక్కలనే నాటారు. చెర్నోబిల్ న్యూక్లియర్ ఘటన తర్వాత నేలలో రేడియోధారి్మకత గాఢత తగ్గించే లక్ష్యంతో అక్కడ ఈ మొక్కలనే శాస్త్రవేత్తలు నాటారు. అలెక్స్ మొక్క కథ త్వరలో ‘బ్లూమ్’పేరిట డాక్యుమెంటరీగా రానుంది.
– ఫోర్ట్ వేనీ