సముద్ర గర్భంలో రష్యా దుష్ట కార్యక్రమాలు  | UK exposes covert Russian submarine operation in and around UK waters | Sakshi
Sakshi News home page

సముద్ర గర్భంలో రష్యా దుష్ట కార్యక్రమాలు 

Apr 10 2026 6:02 AM | Updated on Apr 10 2026 6:01 AM

UK exposes covert Russian submarine operation in and around UK waters

రహస్యంగా జలాంతర్గామి అటాక్‌ ఆపరేషన్లు

రష్యా తీరుపై యూకే ప్రభుత్వం ఆగ్రహం  

రష్యా దుందుడుకు చర్యలను తిప్పికొట్టినట్లు వెల్లడి  

లండన్‌: రష్యా తీరుపై యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తమ ప్రాదేశీక జలాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో రష్యా రహస్యంగా జలాంతర్గామి అటాక్‌ ఆపరేషన్లు నిర్వహిస్తోందని ఆరోపించింది. రష్యా దుందుడుకు చర్యలను తమ సాయుధ దళాలు విజయవంతంగా తిప్పికొట్టినట్లు వెల్లడించింది. కొన్ని వారాల క్రితం హై నార్త్‌లోని అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించిన ఒక రష్యన్‌ అటాక్‌ జలాంతర్గామిని బ్రిటిష్‌ విమానాలు, యుద్ధనౌకలు గుర్తించాయని, దాని కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాయని యూకే రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

ఉత్తర అట్లాంటిక్‌లో నీటి అడుగున కీలకమైన మౌలిక సదుపాయాల సమీపంలో రష్యా సబ్‌మెరైన్లు దుష్ట కార్యకలాపాల్లో పాల్గొన్నాయని విమర్శించింది. రష్యా చర్యలను యూకే ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌ తప్పుపట్టారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దురాక్రమణకు బ్రిటిష్‌ ప్రజలు మూల్యం చెల్లించకుండా కాపాడేందుకు తాను కట్టుబడి ఉన్నట్లు తేల్చిచెప్పారు. తమ సంకల్పాన్ని పరీక్షించే రష్యా నీచ కార్యకలాపాలను బహిర్గతం చేయడానికి, కఠిన చర్యలు తీసుకోవడానికి ఎంతమాత్రం వెనుకాడబోమని స్పష్టంచేశారు. 

బ్రిటిష్‌ సైన్యం ప్రపంచంలోనే అత్యుత్తమమైన సైన్యంలో ఒకటని వివరించారు. తమ జాతీయ, ఆర్థిక భద్రతను కాపాడటానికి ప్రభుత్వం ఏమైనా చేస్తుందన్న విషయంలో ప్రజలకు సందేహం అవసరం లేదన్నారు. ఇప్పుడు చాలామంది దృష్టి పశ్చిమాసియా యుద్ధంపైనే ఉందని బ్రిటిష్‌ రక్షణ మంత్రి జాన్‌ హీలీ అన్నారు. అదేసమయంలో యూకేకు ఉత్తరాన పెరుగుతున్న రష్యా ముప్పునకు తమ సేనలు దీటుగా ప్రతిస్పందిస్తున్నాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగిస్తూనే తమ మాతృభూమిపై ఈగ వాలనివ్వబోమని తేల్చిచెప్పారు. సముద్ర అంతర్భాగంలో తమ మౌలిక సదుపాయాలకు నష్టం కలిగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రష్యాను హెచ్చరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement