పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌కు బిగ్‌ షాక్‌.. మగాడివైతే యుద్ధం చేయ్‌ అంటూ తాలిబన్లు.. | TTP Commander Challenges Pakistan Army Chief Asim Munir | Viral Video Sparks Tension in Islamabad | Sakshi
Sakshi News home page

పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌కు బిగ్‌ షాక్‌.. మగాడివైతే యుద్ధం చేయ్‌ అంటూ తాలిబన్లు..

Oct 23 2025 11:04 AM | Updated on Oct 23 2025 11:44 AM

TTP Leader Open Challenge To Pak Army Chief Asim Munir

ఇస్లామాబాద్‌: దాయాది పాకిస్తాన్‌కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ తెహ్రీకే తాలిబన్‌ పాకిస్తాన్‌ (టీటీపీ)కు చెందిన కమాండర్‌ పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ను టార్గెట్‌ చేసి చాలెంజ్‌ విసిరిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మునీర్‌కు నిజంగా దమ్ముంటే.. మగాడైతే తమను ఎదుర్కోవాలని సవాల్‌ విసిరారు. అలాగే, పాక్‌ సైన్యంలోని ఉన్నతాధికారులకు సైతం సవాల్‌ చేశారు. ఈ మేరకు విడుదల చేసిన వరుస వీడియోలు పాకిస్తాన్‌ సైనిక నాయకత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టాయి.

తెహ్రీకే తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) సంస్థ కమాండర్‌ కాజిమ్‌ వీడియోలో మాట్లాడుతూ నేరుగా ఆర్మీ చీఫ్‌ను ఉద్దేశించి సవాలు విసిరాడు. ఇందులో..‘మాతో పోరాటం చేయడానికి పాకిస్తాన్‌ సైన్యం ఎందుకు?. వారికి బదులుగా పాక్‌ సైన్యంలోని ఉన్నతాధికారులు యుద్ధభూమికి రావాలి. పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌కు నిజంగా దమ్ముంటే.. మాగాడే అయితే మమ్మల్ని ఎదుర్కోవాలి. అతను నిజంగా తల్లి పాలే తాగి ఉంటే మాతో యుద్ధం చేయ్‌ అని సవాల్‌ విసిరారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో అతడి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇదే సమయంలో అక్టోబర్‌ 8న కేపీ ప్రావిన్స్‌లో టీటీపీ జరిపిన దాడి దృశ్యాలు విడుదల చేసింది.  

 

ఇక, ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పాకిస్తాన్‌ ప్రభుత్వం, ఈ నెల 21న కమాండర్ కాజిమ్ ఆచూకీ తెలిపిన వారికి 10 కోట్ల పాకిస్తానీ రూపాయల (పీకేఆర్‌) రివార్డును ప్రకటించింది. అయితే, అక్టోబర్ 8న ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కుర్రంలో టీటీపీ.. పాకిస్తాన్‌ ఆర్మీపై దాడులు చేసింది. ఈ దాడిలో 22 మంది పాక్‌ సైనికులు చనిపోయారని టీటీపీ పేర్కొంది. ఈ దాడిలో భాగంగా తాము స్వాధీనం చేసుకున్న మందుగుండు సామగ్రి, వాహనాలను చూపించింది. మరోవైపు, టీటీపీ దాడిలో 11 మంది సైనికులు మరణించారని పాక్‌ సైన్యం అంగీకరించింది. 

ఇదిలా ఉండగా.. ఇటీవల ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్‌, ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘ‌న్ భూభాగం నుంచి పనిచేస్తున్న టీటీపీ వంటి సాయుధ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ ఒప్పందం నిలుస్తుందని పాకిస్తాన్ స్పష్టం చేసింది. అయినప్పటికీ, టీటీపీ దాడులు ఏమాత్రం తగ్గలేదు. 


పాక్‌లో టీటీపీ దడ..
తెహ్రీక్ ఏ తాలిబాన్ (TTP) ఉగ్రవాద సంస్థ అనేది పాకిస్తాన్‌ పెంచిన పెరటి మొక్క. ఇది అనేక తాలిబాన్‌ వర్గాల కలయికతో ఏర్పడిన ఉగ్రవాద సంస్థ. 2007లో బజావుర్, స్వాట్, ఖైబర్‌ ప్రాంతాల నుంచి పుట్టుకొచ్చిన ఈ వర్గాలు ఒక్కటై పాకిస్తాన్‌లోని మిలిటరీ, రాజకీయ వ్యవస్థలపై దాడులు ప్రారంభించాయి. దీని వెనుక అల్‌ఖైదా ప్రత్యక్ష మద్దతు ఉండటమే కాకుండా, ఒసామా బిన్‌ లాడెన్‌ చుట్టూ ఉన్న నెట్‌వర్క్‌ ఆరంభంలో దీనిని ప్రభావితం చేసింది. ఆఫ్గాన్‌ తాలిబాన్, తెహ్రీకే తాలిబాన్‌ పాక్‌ మధ్య భావజాల సమానత ఉన్నా, లక్ష్యాలు వేరు. ఆఫ్గాన్‌ తాలిబాన్‌ ప్రధానంగా తమ దేశంతోపాటు పాకిస్తాన్‌లో ఇస్లామిక్‌ పాలనను స్థాపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. టీటీపీ పాకిస్తాన్‌లో సైనిక వ్యవస్థను కూల్చి దాని స్థానంలో ఇస్లామిక్‌ శరియా పాలనను తీసుకురావాలని భావిస్తోంది. ఇద్దరి మధ్య మతాధార సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, పాకిస్తాన్‌–ఆఫ్గాన్‌ సంబంధాలు దిగజారడంతో సంబంధాలు తాజాగా మరింత క్లిష్టంగా మారాయి.

టీటీపీ పాకిస్తాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో పెద్దఎత్తున ఉగ్రదాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో టీటీపీ ఉగ్రవాద స్థావరాలన్నీ ఆప్ఘనిస్థాన్‌లోనే ఉన్నాయని పాక్ ఆరోపించింది. ఇటీవలే కాబూల్‌ నగరంపై పాక్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ ఘటన తర్వాత అక్టోబరు 11న పాక్, ఆఫ్గన్ బార్డర్‌లో సైనిక ఘర్షణ పెరిగింది. తాలిబన్ల దాడుల్లో పెద్దసంఖ్యలో పాక్ సైనికులు చనిపోయారు. సరిగ్గా ఇదే సమయంలో ఆప్ఘనిస్తాన్‌ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ భారత్‌‌లో పర్యటించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement